అమెరికా - ఇరాన్ యుద్ధం: మధ్యవర్తిగా పాకిస్తాన్?
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ ఓ కీలకమైన దౌత్యపరమైన చొరవను ప్రారంభించింది. అమెరికా-ఇరాన్ వివాదానికి సమగ్ర పరిష్కారం కోసం మార్గాన్ని సుగమం చేయగల ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం పునరుద్ధరణపై దృష్టి సారించినట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని.. గణనీయమైన పురోగతి సాధించబడిందని.. ఇవి ఈ ప్రాంతంలో మరింత పురోగతికి, శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.
తాను, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో కలిసి ఇరాన్ అధ్యక్షుడిని కలిసినట్లు మొహ్సిన్ నఖ్వీ 'ఎక్స్(ట్విట్టర్)' వేదికగా ప్రకటించారు. ఈ సమావేశం అత్యంత సానుకూలంగా, ఫలవంతంగా జరిగిందని మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ వివాదం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భవిష్యత్ వ్యూహం వంటి అంశాలపై చర్చలు జరిగాయని ఆయన తెలిపారు.

అమెరికా -ఇరాన్ పోరులో పాకిస్థాన్ ఏం చేయగలదు ?
మోసిన్ నఖ్వీ ప్రకారం.. గతంలో ఇస్లామాబాద్‌లో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఎలా పునరుద్ధరించుకోవచ్చనే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు . ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడం అనేది అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు సమగ్ర పరిష్కారం దిశగా ఓ కీలక ముందడుగు కాగలదని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు తమ ప్రభుత్వ అభిప్రాయాలను, ఆందోళనలను నిష్కపటంగా వెల్లడించారు. ఇరుపక్షాలు సంబంధిత అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి, పలు కీలక విషయాలలో పురోగతి సాధించాయని మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు.
అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలు
ఈ సమావేశం చాలా సానుకూల వాతావరణంలో ముగిసిందని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నఖ్వీ పేర్కొన్నారు. ఈ చర్చల ద్వారా ఏర్పడిన ఉత్సాహం కొనసాగి, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్ చాలా కాలంగా తనను తాను ఓ మధ్యవర్తిగా ముందుకు తెస్తోంది. ఇరాన్ నాయకత్వంతో అసిమ్ మునీర్, మొహ్సిన్ నఖ్వీల చర్చలు ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లే సంకేతంగా భావిస్తున్నారు. అయితే ప్రతిపాదిత అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించే దిశగా చర్చలు ఎంత వేగంగా పురోగమిస్తాయి, అలాగే ఇది అమెరికా-ఇరాన్ సంఘర్షణను ముగించడానికి ఒక నిర్దిష్ట ఒప్పందానికి దారితీస్తుందా అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.














Click it and Unblock the Notifications