వార్నీ.. ఈయన ఐఫోన్ ను సొంతంగా తయారు చేసేశాడు.. ఎలాగో చూడండి
చైనాలో ఓ వ్యక్తి ఐఫోన్ 6 ఎస్ ను సొంతంగా తన ఇంట్లోనే తయారు చేసుకున్నాడు. అతగాడు దాన్ని ఎలా రూపొందించాడో సమగ్రంగా వీడియోలో చూపించాడు కూడా.
బీజింగ్: ఐఫోన్ కొనుక్కోవాలంటే మీరందరూ ఎక్కడికి వెళ్తారు.. ఆపిల్ స్టోర్ కు లేదా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. సింపుల్ గా మన ఇంట్లోనే ఐఫోన్ తయారు చేసుకుంటే పోలా.. అనుకుని రంగంలోకి దిగేశాడు.
ఐఫోన్ తయారీకి అవసరమయ్యే విడి భాగాలన్నింటిన్నీ చైనాలోని ఫేమస్ మార్కెట్ షెన్జెన్ నుంచి సేకరించి మొత్తానికి ఐఫోన్ 6ఎస్ ను ఇంట్లోనే తయారీచేసేశాడు. తాను ఐఫోన్ 6ఎస్ ఎలా రూపొందించాడో తెలుపుతూ ప్రాథమిక ప్రక్రియ నుంచి తుది దశ వరకు ఐఫోన్ తయారీ వీడియోను యూట్యూబ్ లోని స్ట్రేంజ్ పార్ట్స్ ఛానల్ లో పెట్టాడు.
ఇంకేముంది.. ఆ వీడియో వైరల్ గా మారిపోయింది. యూట్యూబ్ లో ఈ వీడియోకు లైక్స్, కామెంట్స్ దంచికొడుతున్నాయి. ఐఫోన్ మెటల్ బ్యాక్ కేసు కోసం వెతకడం దగ్గరినుంచి ఈ వీడియో ప్రారంభమవుతుంది.

అక్కడి నుంచి ఐఫోన్ కు అవసరమైన విడిభాగాలన్నింటిన్నీ చైనాలోని షెన్జెన్ మార్కెట్లో వెతుకుతూ ఒక్కొక్కటిగా అమర్చడం ఈ వీడియోలో చూపించాడా వ్యక్తి. మొత్తానికి ఇతడు పడిన కష్టం వృథా పోలేదు. రెండు నెలలపాటు కష్టపడి మరీ ఐఫోన్ ను సొంతంగా తయారుచేసుకున్నాడు.
కొన్నిసార్లు విఫలమయ్యాడు కూడా. అయితే విఫలమైనా అతడు పట్టుదల మాత్రం కోల్పోలేదు. గ్లాస్ ప్యానల్, డిజిటైజర్, ఎల్సీడీ ప్యానల్, బ్యాక్ లైట్, లాజిక్ బోర్డు, బ్యాటరీ, కెమెరా మోడ్యుల్, హోమ్ బటన్, స్క్రీవ్యూస్ వంటి వాటిని షెన్జన్ మార్కెట్లో పొందడం, అమర్చడం, ఫెయిల్ అవ్వడం మళ్లీ అసెంబ్లింగ్ చేయడం.. మొత్తం ఈ ప్రక్రియ అంతా ఈ వీడియోలో చూపించాడు.
ఎట్టకేలకు విజయం సాధించాడు. తన కోసం తాను సొంతంగా ఐఫోన్ 6ఎస్ తయారు చేసుకున్నట్టు పేర్కొన్నాడు. మరి మీరేం చేస్తారు? ఐఫోన్ ను కొనుక్కుంటారా? లేక ఇతగాడు తయారు చేసుకున్నట్లు ఇంట్లో చేసేసుకుంటారా? చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి మరి!












Click it and Unblock the Notifications