డ్రోన్ ఫుటేజ్: హమాస్ చీఫ్ చివరి క్షణాలు- భయానక స్థితిలో..!!
Yahya Sinwar: గాజా ప్రధాన కేంద్రంగా తన మధ్య ఆసియా దేశాల్లో కార్యకలాపాలను ఉధృతంగా కొనసాగిస్తోన్న మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆట కట్టించింది ఇజ్రాయెల్. దాని అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టింది. గురువారం సాయంత్రం గాజాపై నిర్వహించిన డ్రోన్ దాడిలో ఆయన హతం అయ్యారు.
గత ఏడాది ఇదే అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో నిర్వహించిన నరమేథానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయిందని, యాహ్యా సిన్వర్ హత్యతో హమాస్ ఇక ఇప్పట్లో కోలుకోలేకపోవచ్చనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఈ ఘటనను అమెరికా సహా వివిధ దేశాలు స్వాగతించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ స్పందించారు. ఇజ్రాయెల్ సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు.

2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌ను గట్టి దెబ్బ కొట్టింది హమాస్. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఉన్న ఇజ్రాయెల్ గ్రామాలపై విరుచుకుపడింది. స్థానికులను బందీలుగా పట్టుకుంది. ఇప్పటికీ అనేక మంది పైగా ఇజ్రాయెలీలు హమాస్ ఆధీనంలో ఉన్నారు.
అప్పటి నుంచీ తరచూ ప్రతీకార దాడులకు దిగుతూ వచ్చింది ఇజ్రాయెల్. హమాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయిల్ హనియాను హతమార్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఈ ఏడాది జులైలో ఇస్మాయిల్ బస చేసిన భవనంపై భీకర దాడికి దిగింది. ఈ దాడిలో ఆయనతో పాటు బాడీగార్డ్ మరణించారు.
ఇస్మాయిల్ మరణించిన విషయాన్ని ఇరాన్, హమాస్ ధృవీకరించాయి. ఈ దాడి వెనుక ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఆరోపించాయి. దాని తరువాత కూడా ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు. మరింత తీవ్రతరం చేసింది. లెబనాన్‌లో హమాస్ మిలిటెంట్లు, సానుభూతిపరులను పేజర్ బాంబులతో దాడి చేసింది.
ఇప్పుడు తాజాగా గాజాలోని రఫా జిల్లాలో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుపెట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. డ్రోన్‌తో చిత్రీకరించిన వీడియో ఇది. గాజాలో హమాస్ సిన్వర్ నివసించిన అపార్ట్‌మెంట్‌పై నిర్వహించిన దాడులు ఇందులో రికార్డ్ అయ్యాయి.
ఐడీఎఫ్‌కు చెందిన 828 బ్రిగేడ్, షిన్ బెట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ ఇది. ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైన ఓ భవనంలో సోఫాపై కూర్చున్న స్థితిలో కనిపించాడు యాహ్యా సిన్వర్ ఈ వీడియోలో. అప్పటికే అతను ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని చెయ్యి పూర్తిగా తెగిపోయింది. ఒక చేత్తో తన ముఖాన్ని దాచుకుంటూ చేతికి అందిన ఓ కర్రను ఐడీఎఫ్ డ్రోన్‌పైకి విసరడం ఇందులో చూడొచ్చు.
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024
ఆ అపార్ట్‌మెంట్‌లో సిన్వర్ ఒక్కడే ఉన్నాడని ఐడీఎఫ్ ప్రకటించింది. అతని వెంట హమాస్ టెర్రరిస్టులు గానీ, ఇజ్రాయెలీ బందీలుగా గానీ లేరని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరి తెలిపారు. అదే అపార్ట్‌మెంట్‌లో కొన్ని తుపాకులు, 40,000 విలువ చేసే తమ దేశ కరెన్సీ ఉన్నట్లు గుర్తించామని అన్నారు.












Click it and Unblock the Notifications