West Asia conflict: పశ్చిమాసియాలో ఆగని ఉద్రిక్తతలు.. 22 మంది భారతీయులు మృతి..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇప్పటి వరకూ 22 మంది భారతీయులు మృతిచెందారు. వీరిలో 14 మంది నావికులు ఉన్నారు. అలాగే సౌదీ అరేబియాపై హౌతీ దళాల దాడుల్లో మరో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాల్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు పశ్చిమాసియాలో పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. " పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ దాడుల్లో మనం 22 మంది భారతీయులను కోల్పోయాం. వారిలో 14 మంది నేవికులు ఉన్నారు" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం మీడియాకు తెలిపారు.
అలాగే సౌదీ అరేబియాపై ఇటీవల హౌతీ దళాలు చేపట్టిన దాడుల్లో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ప్రస్తుతం సౌదీ- హౌతీల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు గల్ఫ్ దేశాల్లోని భారతీయులతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఈమేరకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తోందని పేర్కొన్నారు. ఇక పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో యెమెన్ లోని సనా ఎయిర్ పోర్ట్ పై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేపట్టింది. దాంతో సౌదీలోని ఎయిర్ పోర్ట్ లపై హౌతీ దళాలు దాడులు చేపట్టాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి.

ఇక ఈ నెలలో సౌదీలోని రియాద్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ పై హౌతీ దళాలు జరిపిన దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఇరాన్- అమెరికా మధ్య జరిగిన దాడుల్లో అనేకమంది నేవికులు ప్రాణాలు కోల్పోయారు. హార్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకలు దాటుతుండగా ఈ దాడులు జరిగాయి. అటు ఇరాన్- అమెరికా యుద్ధం హార్మూజ్ జలసంధి కేంద్రంగా మారిన సంగతి తెలిసిందే. అయితే కేవలం దౌత్య పరమైన చర్యలతోనే ఇరు దేశాల మధ్య శాంతి సాధ్యం అని భారత్ పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
