హైదరాబాద్ లో భవనాల నిర్మాణంలో ఆ వాటర్ మాత్రమే వాడాలి: రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఎల్ నినో దెబ్బ కొట్టింది. తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. పూర్తిగా నిరాశపరిచాయి. బంగాళాఖాతంలో అడపాదడపాగా ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల వల్ల వర్షాలు పడుతోన్నప్పటికీ.. అవి ఏ మాత్రం చాలట్లేదు. దీని ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. ఇక్కడ మంచినీటి సంక్షోభం ఏర్పడింది. భూగర్భ జలాలు సైతం అడుగంటాయి. మంచినీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది.
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో మంచినీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ బోధి పెవిలియన్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హైదరాబాద్ వాటర్ వర్క్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ప్రాంత పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని అన్నారు.
సచివాలయంతో పాటు సీఎంఓ, అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, ఇతర శాఖల కార్యాలయాల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి, ఇతర అవసరాలకు శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చూడాలని అన్నారు. పబ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్రతకు కూడా ట్రీటెడ్ వాటర్‌నే వాడాలని సూచించారు. భవన నిర్మాణాల్లోనూ శుద్ధి చేసిన నీటినే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీధోరణి వద్దని అన్నారు.
ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో ఉన్నతాధికారులను ఆదేశించారాయన. ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ప్రతి నీటిశుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైడ్రా అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగం, పొదుపుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.














Click it and Unblock the Notifications
