డొనాల్డ్ జీ.. మీ నిర్ణయం బాధాకరం- పునఃసమీక్షించుకోండి
Donald Trump's swearing-in ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే కేపిటల్ హిల్స్ ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలను స్వీకరించారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో, ఆ తరువాత ఇచ్చిన పలు ప్రసంగాల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన ఆర్డర్లు అవి.

ఆయన సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లల్లో ఒకటి- ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సంబంధించినది. ఇందులో నుంచి అమెరికా వైదొలగడానికి ఉద్దేశించిన ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా తప్పుకోవడం వల్ల డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు స్తంభించిపోతాయి. ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్‌లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటోంది.
ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓకు అతిపెద్ద ఆర్థిక వనరు అమెరికానే. కోవిడ్ లాంటి ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు గానీ లేదా ఇతర అంటువ్యాధులు ప్రబలినపుడు అమెరికా నుంచి అందే ప్రత్యేక నిధులు సైతం డబ్ల్యూహెచ్ఓకు అందవు. ఇందులో నుంచి తప్పుకొంటే వ్యాధులు ప్రబలిన విపత్కర సమయాల్లో పేద దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేన్ నుంచి అందే ఆర్థిక సహాయం మందగించే అవకాశం లేకపోలేదు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెసుస్ ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆరోగ్య భద్రతను అందిస్తోన్నామని గుర్తు చేశారు.
ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ల తయారీ, పేద దేశాలకు వాటిని పంపిణీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోన్నామని, హెల్త్ ఎమర్జెన్సీ వంటి సమయాల్లో ఇతరులు ఎవ్వరూ వెళ్లడానికి సాహసించని ప్రదేశాల వెళ్లి అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తోన్నామని పేర్కొన్నారు.
1948 నుంచీ అమెరికా డబ్ల్యూహెచ్‌ఓకు ప్రధాన ఆర్థిక వనరుగా, విధి నిర్వహణలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోందని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా 193 సభ్య దేశాలతో కూడిన ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులకు సరైన దిశానిర్దేశం చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. స్మాల్ పాక్స్ వంటి వ్యాధుల బారి నుంచి అమెరికన్లను సైతం డబ్ల్యూహెచ్ఓ కాపాడిందని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలంటూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడుతున్నానని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ఏడేళ్లుగా భారీ ఎత్తున సంస్కరణలను కొనసాగిస్తోన్నామని, ఈ తరుణంలో అమెరికా తప్పుకోవాలనుకోవడం సరైంది కాదని అన్నారు. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications