వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు దేశ బహిష్కారం..నేడు ప్రధాని పీఠం: కాశ్మీరీ నేతకు పాకిస్తాన్ పగ్గాలు: ఎవరీ షెహబాజ్ షరీఫ్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్‌లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కొనసాగుతూ వచ్చిన రాజకీయ సంక్షోభానికి తెర పడినట్టే. అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఉద్వాసనకు గురయ్యారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్ సందర్భంగా అధికార పక్షం తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 174 మంది ఓటు వేశారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ దీన్ని ఆమోదించింది.

 ఇమ్రాన్ ఖాన్‌ ఉద్వాసన..

ఇమ్రాన్ ఖాన్‌ ఉద్వాసన..

ఇమ్రాన్ ఖాన్ ఉద్వాసనకు గురి కావడంతో ఇక కొత్త ప్రధానమంత్రి ఎవరనే విషయం చర్చనీయాంశమైంది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది? ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలను స్వీకరించనున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్.. పాకిస్తాన్‌కు కాబోయే కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అక్కడి మీడియా అంచనా వేసింది.

ఎవరీ షెహబాజ్ షరీఫ్..?

ఎవరీ షెహబాజ్ షరీఫ్..?

షెహబాజ్ షరీఫ్.. 70 సంవత్సరాల రాజకీయనేత. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు స్వయానా సోదరుడు. పనామా పేపర్స్ కుంభకోణం ఆరోపణలతో నవాజ్ షరీఫ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమైన తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఇదివరకు పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా పని చేశారు. పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోవడంలో కీలక పాత్రను పోషించారు.

నాడు దేశ బహిష్కరణ..

నాడు దేశ బహిష్కరణ..

గతంలో షెహబాజ్ షరీఫ్ దేశ బహిష్కారానికి గురయ్యారు. 1999లో పాకిస్తాన్‌ను ఏలిన అప్పటి సైనిక ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. సుదీర్ఘకాలం పాటు జైలు జీవితాన్ని గడిపారు. విడుదలైన తరువాత దేశ బహిష్కరణకు గురయ్యారు. కొన్ని సంవత్సరాల పాటు సౌదీ అరేబియాలో తలదాచుకున్నారు. 2007లో మళ్లీ స్వదేశం గడప తొక్కారు. స్వదేశానికి చేరిన వెంటనే రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని బలోపేతం చేశారు.

పీఎంఎల్ (ఎన్) చీఫ్‌గా

పీఎంఎల్ (ఎన్) చీఫ్‌గా

పనామా పేపర్ల కుంభకోణంలో నవాజ్ షరీఫ్ పేరు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అరెస్ట్ అయ్యారు. పది సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. దీనితో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ బాధ్యతలను షెహబాజ్ షరీఫ్ స్వీకరించారు. 2017 నుంచీ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్నారు. అమెరికాతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సత్సంబంధాలను నెలకొల్పుకుంటోందని, దాన్ని వ్యతిరేకిస్తున్నామని మొదటి నుంచీ చెబుతూ వస్తోన్నారు.

 కాశ్మీర్ నుంచి వలస..

కాశ్మీర్ నుంచి వలస..

నిజానికి- షెహబాజ్ పూర్వీకులది జమ్మూ కాశ్మీర్. అనంత్‌నాగ్ వారి స్వస్థలం. వ్యాపార కార్యకలాపాల కోసం అనంత్‌నాగ్ నుంచి పంజాబ్‌ అమృత్‌సర్ సమీపంలోని జటీ ఉమ్రా పట్టణానికి తరలి వెళ్లింది. అక్కడే స్థిరపడింది. ప్రత్యేక దేశంగా ఏర్పాటైన అనంతరం ఈ ప్రాంతం మొత్తం పాకిస్తాన్‌లో విలీనమైంది. లాహోర్‌కు సమీపంలో ఉంటుందీ జటీ ఉమ్రా. ఇప్పటికీ షరీఫ్ బంధువులు ఇక్కడే నివసిస్తోన్నారు. ఒకే కుటుంబం నుంచి తొలుత నవాజ్ షరీఫ్.. తాజాగా షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్‌కు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

English summary
Shehbaz Sharif, Leader of the Opposition, is being considered a frontrunner to be Pakistan's next prime minister. He is little known outside Pakistan but has a reputation domestically as an effective administrator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X