విమానంలో బిడ్డను ప్రసవించిన మహిళ... "కొత్త వ్యక్తికి స్వాగతం" అన్న ఫ్లయిట్ కెప్టెన్
శాన్ ఫ్రాన్సిస్కో: ఓ మహిళ విమానంలో బిడ్డను ప్రసవించిన ఘటన లాస్ ఏంజెలిస్ జరిగింది. వివరాల్లోకి వెళితే సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన 623 విమానం ఫీనిక్స్ వెళ్లేందుకు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఓ ప్రయాణికురాలికి ప్రసూతి నొప్పులు మొదలయ్యాయి.
దీంతో ఆ విమానాన్ని లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఆ విమానంలోని సిబ్బంది, ప్రయాణీకుల్లో ఉన్న ఓ డాక్టర్, నర్సు ఆమె ప్రసవ విషయంలో సాయపడ్డారని విమానయాన అధికార ప్రతినిధి ఎమిలీ శామ్యూల్స్ వెల్లడించారు.

దీంతో ఎలాంటి సమస్య లేకుండా ఆమె పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. "కేర్" మని బిడ్డ ఏడుపు వినిపించగానే కొత్త వ్యక్తికి స్వాగతమని ఫ్లయిట్ కెప్టెన్ మైక్‌లో చెప్పాడు. లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవగానే తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు.
వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని లాస్ ఏంజెలిస్ అగ్నిమాపక విభాగం ప్రతినిధి ఎరిక్ స్కాట్ తెలిపారు. షెడ్యూల్ టైమ్ కన్నా రెండు గంటల ఆలస్యం అవడంతో విమానంలోని మిగతా ప్రయాణీకులను వేరే విమానంలో ఫీనిక్స్‌కు పంపారు.












Click it and Unblock the Notifications