రిషి సునాక్ అమ్మ చేతి వంట రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు- బర్ఫీ టేస్ట్‌కు ఫిదా
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. దీనికి విరామం అనేది ఉండట్లేదు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అటు ఉక్రెయిన్ బలగాలు రష్యా సైన్యాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రతిఘటిస్తోన్నాయి.

ఈ క్రమంలో కీలకమైన ఖేర్సన్‌ను రష్యా సైనికుల ఆధీనం నుంచి విడిపించుకోగలిగాయి కూడా. అక్కడి నుంచి రష్యా సైనిక బలగాలను వెనక్కి పంపించడంలో విజయంసాధించగలిగాయి. రాజధాని కీవ్‌ను రష్యా సైనికులు చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. ఈ దాడులు ప్రతిదాడులతో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం మొత్తం అట్టుడికి పోతోంది.
ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ.. బ్రిటన్ పర్యటన చేపట్టారు. లండన్‌లో ల్యాండ్ అయ్యారు. రక్షణ కార్యకలాపాల కోసం వినియోగించే ఆర్ఎఎఫ్ విమానాశ్రయంలో జెలెన్‌స్కీకి ఘన స్వాగతం లభించింది. బ్రిటన్ విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల అధికారులు, బ్రిటన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానం పలికారు.
అనంతరం నేరుగా 10 డౌనింగ్ స్ట్రీట్‌లో గల బ్రిటన్ ప్రధానమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. స్నేహపూరక వాతావరణంలో వారిద్దరి మధ్య భేటీ కొనసాగింది. జెలెన్‌స్కీకి విందును ఏర్పాటు చేశారు రిషి సునాక్. ఈ సందర్భంగా హోమ్ మేడ్ ఇండియన్ బర్ఫీని స్వయంగా వడ్డించారు. దీన్ని తన తల్లి ఉషా సునాక్ స్వయంగా తయారు చేశారని వివరించారు.
ఇండియన్ బర్ఫీ ప్రత్యేకతన వివరించారు. ఇది తనకు చాలా ఇష్టమైన స్వీట్‌గా అభివర్ణించారు రిషి సునాక్. స్వీట్లను అమ్మ స్వయంగా ఇంట్లో తయారు చేస్తుంటారని, రోజూ తినడానికి ఛాన్స్ ఇవ్వరనీ నవ్వుతూ చెప్పుకొచ్చారు. జెలెన్‌స్కీతో జరిగిన భేటీలో ఇదే డిష్‌ను ఆయనకు వడ్డించడం సంతోషంగా ఉందని రిషి సునాక్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications