IPL 2020: ఆ యువ ఆటగాళ్ల ఆటకు నేను ఫిదా: బ్రియాన్ లారా
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో తమదైన ఆటతో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లపై వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. వారికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఓ ఆరుగురి ఆట తనను విపరీతంగా ఆకట్టుకుందని హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విండీస్ వీరుడు చెప్పుకొచ్చాడు. 'ఈ సీజన్‌లో మీరు మెచ్చిన యువ ఆటగాళ్లు ఎవరు?'ప్రశ్నించగా.. లారా భారత ఆటగాళ్లైన ఆరుగురి పేర్లు సూచించాడు. వారే ఎందుకో కూడా చెప్పుకొచ్చాడు.
ఇక తనకు ఇష్టమైన ప్లేయర్లలో సంజూ శాంసన్ మొదటి వాడని బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు.'సంజూ సామర్థ్యం నాకిష్టిం. అయితే ప్రతీసారి అతని ఆటను ఇష్టపడుతానని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. అతనికి అద్భుతమైన శక్తి ఉంది. అంతకు మించి బంతిని బాదడానికి మంచి టైమింగ్ ఉంది. అతను ఉన్నతస్థాయికి చేరుతాడు'అని లారా చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరుపున ఆడిన సంజూ ఆరంభంలో విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. టోర్నీ మొత్తంలో 26 సిక్స్‌లు కొట్టగా.. ఇందులో 16 తొలి రెండు మ్యాచ్‌ల్లోనివే కావడం గమనార్హం.

ఇక తాను మెచ్చిన రెండో ఆటగాడు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్ అని లారా తెలిపాడు. 'నాకు నచ్చిన ఆటగాళ్లలో సూర్య ఒకడు. ఒక వేళ టీమ్‌లో బెస్ట్ ప్లేయర్లు ఓపెనర్లుగా లేనప్పుడు సూర్యకుమార్‌ను ఫస్ట్ డౌన్‌లో పంపించాలి. ఓపెనర్లు ఆడటంలో విఫలమైతే అతను నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడు. ఈ సీజన్‌లో ముంబై తరఫున అతను అదే చేశాడు. అతని ఆటను ఆస్వాదించా'అని లారా పేర్కొన్నాడు. ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన సూర్య 41.90 సగటు, 148.23 స్ట్రైక్‌రేట్‌తో 461 రన్స్ చేశాడు.
ఇక దేవదత్ పడిక్కల్ కూడా బాగా ఆడాడని తెలిపిన లారా.. అతనికి కొన్ని సూచనలు చేశాడు. 'దేవ్‌దత్ పడిక్కల్‌కు చాలా సామర్థ్యం ఉంది. అయితే అతను కొన్ని విషయాలను మార్చుకోవాలి. నేను అతను కేవలం టీ20, ఐపీఎల్‌లో మాత్రమే ఆడాలని కోరుకోవడం లేదు. అతను టెస్ట్‌ల్లో కూడా ఆడాలి. దానికి కొన్ని టెక్నిక్‌లను తెలుసుకోవాలి. త్రీ స్లిప్స్, గల్లీ ఉంటే పడిక్కల్ హుక్ షాట్ ఆడుతున్నాడు. అతను టీ20 వెర్షన్ మాత్రమే ఆడుతున్నాడు.'అని లారా చెప్పుకొచ్చాడు. ఇక ఆర్‌సీబీ తరఫున పడిక్కల్ మెరుగైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే.
ఇక తాను మెచ్చిన ఆటగాళ్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ ఆటగాళ్లు అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్ ఉన్నారని లారా తెలిపాడు. రాహుల్ ఓ మంచి ఆటగాడని, అతని గురించి ఇంతకు మించి ఏం చెప్పగలన్నాడు. ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడుతున్నారని లారా కితాబిచ్చాడు. గార్గ్‌లో సత్తా ఉందన్నాడు.












Click it and Unblock the Notifications