IPL 2023:ఫ్రాంఛైజీలకు రోహిత్ శర్మ విజ్ఞప్తి...వాళ్ల అవసరం చాలా ఉంది ప్లీజ్..!
మార్చి 31వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక శుక్రవారం నుంచి ప్రాక్టీస్ సెషన్‌లు కూడా ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌లో ఆడాల్సి ఉన్న పలు స్టార్ క్రికెటర్లు గాయాలతో టోర్నమెంట్‌కు దూరమయ్యారు. ఇక టీమిండియాను కూడా గాయాల బెడద వెంటాడుతోంది. టీమిండియాలోని పలు ప్లేయర్లు ఐపీఎల్‌కు గాయం కారణంగా దూరంకానున్నారు. గాయం అంత తీవ్రతరమైనది కాకుంటే ఆటగాళ్లను ఐపీఎల్‌లోఆడించాలనే ప్రయత్నాల్లో జట్టు యాజమాన్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేశాయి యాజమాన్యాలు. ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్‌లో భారత్ పలు కీలక టోర్నమెంట్‌లు ఆడాల్సి ఉంది. గాయాలపాలైన ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడిస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉంది. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ పదహారవ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు స్వదేశీ ప్లేయర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా గాయాల బారిన పడి టోర్నమెంట్లకు దూరం అవుతున్నారు. విదేశీ ఆటగాళ్ల సంగతి అటుంచితే స్వదేశీ ఆటగాళ్లు టీమిండియా తరపున భవిష్యత్తులో పలు మెగా టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది. గాయాలపాలైన వారిని ఫ్రాంఛైజీలు ఆడించే ప్రయత్నం చేస్తుండటంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశాడు. రెండు నెలల సుదీర్ఘ ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత జూన్‌లో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. దీంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్ చాలా కీలకమని రోహిత్ శర్మ చెబుతున్నాడు.

భవిష్యత్తులో టీమిండియా పలు ఐసీసీ టోర్నీల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌తో ఆటగాళ్లు ఫిట్‌నెస్ కోల్పోతారు కదా అన్న ప్రశ్నకు రోహిత్ శర్మ సూటిగా జవాబిచ్చారు. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసిందని చెప్పారు. కానీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. అయితే అంతిమ నిర్ణయం ఫ్రాంఛైజీలదే అని స్పష్టం చేశాడు. ఆటగాళ్లకు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు కాబట్టి ఆ నిర్ణయం ఫ్రాంఛైజీలదే ఉంటుంది.అయితే ఎవరైతే గాయాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఏ ఐపీఎల్ జట్టుకైతే ఆడుతున్నారో ఆ జట్టు యాజమాన్యాలకు ఉన్న పరిస్థితిని వివరించినట్లు రోహిత్ శర్మ చెప్పాడు.ఇక అంతిమ నిర్ణయం ఫ్రాంఛైజీలదే అవుతుందని అన్నారు. ఇక ఆటగాళ్లు కూడా తమ ఫిట్‌నెస్‌పై తాము శ్రద్ధ తీసుకోవాలని సూచించాడు.ఒకవేళ తమ శరీరంలో మార్పులు గమనించినట్లయితే ఆయా ఫ్రాంఛైజీలతో మాట్లాడి ఒకటి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకునేలా ఒప్పించాలని రోహిత్ చెప్పాడు.

టీమిండియాలో ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు గాయాలబారిన పడ్డారు. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్‌లు ఇప్పటికే దూరమయ్యారు. ఇక శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్న కచ్చితమైన ప్లేయర్లు మిస్ అయితే వారి స్థానాలను భర్తీ చేయడం కష్టతరమవుతుందిన రోహిత్ అభిప్రాయపడ్డాడు.అందుకే కొంతమంది కీలక ప్లేయర్లపై దృష్టి సారించినట్లు చెప్పిన రోహిత్ వారికి సరైన విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు టీమిండియా మెడికల్ టీమ్ కూడా ఆటగాళ్లు ఫిట్ ఉండేలా వరల్డ్ కప్ సమయానికల్లా అంతా సవ్యంగా ఉండేలా ఫోకస్ చేసిందని చెప్పాడు.అప్పటికల్లా 15 ఆటగాళ్లను సిద్ధం చేస్తుందనే విశ్వాసం రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు.













Click it and Unblock the Notifications