తెలంగాణలో మరో పులివెందుల..: వైఎస్ విజయమ్మ
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ఇవ్వాళ ఖమ్మం జిల్లా పాలేరులో పర్యటించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఖమ్మం: తెలంగాణ.. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఈ ఏడాడి ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో- ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్నిపార్టీలు ప్రజలతో మమేకం అవుతోన్నాయి. టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత ఎదుర్కొనబోతోన్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ.

పాదయాత్రలతో..
ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఈ విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఓ అడుగు ముందే ఉన్నారు. ఇవ్వాళ్టితో ఆమె చేపట్టిన పాదయాత్ర 238వ రోజుకు చేరుకుంది. పాలకుర్తి, తొర్రూర్ నియోజకవర్గాల్లో ఇవ్వాళ పర్యటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి వివరించారు. దేవాదుల కాలువల ద్వారా చెరువులకు నీళ్లు నింపారని గుర్తు చేశారు. వేలాదిమందికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించారని చెప్పారు.

పాలేరులో
ఒకవంక- వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తోండగానే- మరోవంక ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కార్యాలయం ప్రజా భవన్ అందుబాటులోకి వచ్చింది. వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ఈ భవనాన్ని ప్రారంభించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

భారీ మెజారిటీతో..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన బిడ్డ వైఎస్ షర్మిలను భారీ మెజారితో గెలిపించాలని వైఎస్ విజయమ్మ కోరారు. పాలేరును షర్మిలకు బహుమతిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలేరు ప్రజలకు షర్మిల జీవితాంతం సేవ చేస్తుందని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో అసంపూర్తిగా మిగిలిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆయన వారసురాలు వైఎస్ షర్మిల ప్రజల ముందుకొచ్చారని అన్నారు.

పులివెందుల ఎలాగో..
రాజన్న రాజ్యానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాలేరు నుంచే పునాది పడాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. తమ కుటుంబానికి పులివెందుల ఎలాగో.. వైఎస్ షర్మిలకు పాలేరు కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ, ఎవ్వరికీ రాని భారీ మెజారిటీతో పాలేరు నుంచి వైఎస్ షర్మిలకు శాసనసభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. పాలేరు నియోజకవర్గంలో ఎవ్వరికి ఎలాంటి ఆపద వచ్చినా షర్మిల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మాట ఇస్తే..
ఒక్కసారి మాట ఇస్తే వైఎస్ కుటుంబం ఎప్పటికీ వెనక్కి వెళ్లదని విజయమ్మ చెప్పారు. పాలేరు ప్రజలు తన భర్త, తమ కుటుంబానికి ఎప్పుడూ సన్నిహితంగా ఉంటూ వస్తోన్నారని గుర్తుచేశారు. అందుకే తన బిడ్డ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పాలేరును ఎంచుకున్నారని వివరించారు. ఖమ్మంను తెలంగాణకు ప్రధాన గుమ్మంగా పిలుస్తుంటారని, భవిష్యత్తులో ఏర్పడబోయే వైఎస్ఆర్టీపీ ప్రభుత్వానికి పాలేరు సింహద్వారం అవుతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications