రాయల్ ఛాలెంజర్స్‌కు ఎదురుదెబ్బ: గాయాల లిస్ట్ లో మరో బ్యాటర్
న్యూఢిల్లీ: ఇంకొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఆరంభం కాబోతోంది. ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. గడువు సమీపిస్తోన్న కొద్దీ గాయాల బారిన పడుతున్న ప్లేయర్ల జాబితా పెరుగుతోండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వేర్వేరు ఫ్రాంఛైజీలకు చెందిన డజను మంది ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు.
నరేంద్ర మోదీ స్టేడియంలో..
ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans).. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సీఎస్‌కే (CSK)కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)- సారథ్యాన్ని వహిస్తోన్నారు.

ఆదివారం ఆర్సీబీ..
ఏప్రిల్ 2వ తేదీన అయిదో మ్యాచ్ లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengalore)- ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఆర్సీబీ (RCB)కి ఫాఫ్ డుఫ్లెసిస్ (Faf du Plessis) కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)- ముంబై ఇండియన్ (Mumbai Indians) సారధ్య బాధ్యతలను తీసుకున్నాడు.
ఎదురుదెబ్బ..
ఇప్పుడు- సీజన్ ఆరంభానికి ముందే ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ (Rajat Patidar) జట్టుకు దూరం అయ్యాడు. మడమ గాయంతో అతను బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంటోన్నాడు. గాయం నుంచి కోలుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 సీజన్ ఫస్ట్ హాఫ్ కు రజత్ పాటిదార్ (Rajat Patidar) దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెకెండ్ హాఫ్ నాటికి జట్టుకు అందుబాటులోకి వస్తాడని అంటున్నారు.
నిలకడగా..
2021 సీజన్ లో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన రజత్ పాటిదార్. తొలి సీజన్ లో పెద్దగా రాణించలేదు గాని 2022 లో మాత్రం దుమ్ము దులిపాడు. సెంచరీ బాదాడు. 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో ఇదే అతని వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్. ఐపీఎల్ లో ఇప్పటివరకు అతను ఆడింది 12 మ్యాచ్ లే. 40.40 సగటుతో 280 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 144.29. ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు బాదాడు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తోన్నాడు. అతనిపై భారీ ఆశలను పెట్టుకుంది ఆర్సీబీ మేనేజ్ మెంట్. ఫస్ట్ హాఫ్ లో అందుబాటులో లేకపోవడం వల్ల బ్యాటింగ్ కాంబినేషన్ లో కీలక మార్పులు చేయొచ్చు ఆర్సీబీ మేనేజ్ మెంట్.












Click it and Unblock the Notifications