రిమాండ్‌కు అచ్చెన్న: రోడ్డెక్కిన టీడీపీ నేతలు: నిమ్మాడలో పోలీసుల మోహరింపు: 144 సెక్షన్
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి స్థానిక న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయదలిచిన కింజరాపు అప్పన్నను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారనే కారణంతో ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోటబొమ్మాళి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
కేటీఆర్ పట్టాభిషేకంపై మరో లీక్: టైమ్ కోసం వెయిటింగ్: తిరుమలలో హైదరాబాద్ మేయర్
ఆయన అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకున్న తరువాత న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది.
దీనితో పోలీసులు ఆయనను శ్రీకాకుళం సమీపంలోని అంపోలులో గల కేంద్ర కారాగారానికి తరలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా, నామినేషన్ పత్రాలను దాఖలు చేయదలిచిన అభ్యర్థిని అడ్డుకున్నారనే కారణంతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు న్యాయస్థానానికి విరించారు.

అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ చేయగా.. ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని తొలుత టీడీపీ నేతలు భావించారు. అచ్చెన్నాయుడికి దగ్గరి బంధువైన కింజరాపు అప్పన్న వైసీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించగా.. ఆయనను అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అచ్చెన్నాయుడి అరెస్టుపై శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అచ్చెన్న అరెస్టును నిరసిస్తూ టెక్కలి, నిమ్మాడ, కోటబొమ్మాళి వంటి చోట్ల ప్రదర్శనలను నిర్వహించారు. పలుచోట్ల రోడ్డుపై బైఠాయించారు.
అచ్చెన్న అరెస్టుతో నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. కోటబొమ్మాళి, నిమ్మాడల్లో 144 సెక్షన్‌ను విధించారు. జిల్లాలో పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గుండా లక్ష్మీదేవి, కూన రవికుమార్ ఇతర నాయకులు అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.