వైసీపీ అభ్యర్థి దువ్వాడకు బిగ్ షాక్.. నామినేషన్‌కు ముందే
Duvvada Srinivas: ఇంకో రెండు రోజుల్లో ఏపీలో నామినేషన్ల పర్వం ఆరంభం కాబోతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 18వ తేదీన తెరలేవబోతోంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. వాటిని ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది.
నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్.. సోదరుడు శ్రీకాంత్ పార్టీ ఫిరాయించారు. భార్య జయశ్రీతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్నారు.

దువ్వాడ శ్రీనివాస్.. ఈ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిను ఢీ కొడుతోన్నారు. 2014లో కూడా ఆయన ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడిపోయారు.
ఈ సారి ఎలాగైనా సరే గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌కు ఆయన సోదరుడు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ షాక్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నామినేషన్ల పర్వం ఆరంభం కావడానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీకాంత్ భార్య, కాళింగుల కార్పొరేషన్ డైరెక్టర్ జయశ్రీ కూడా టీడీపీలో చేరారు.
టెక్కలి నియోజకవర్గం పరిధిలో దువ్వాడ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారనేది వారి ఆరోపణ. అందరినీ కలుపుకొని వెళ్లట్లేదని, సొంతంగా నిర్ణయాలను తీసుకుంటారని విమర్శిస్తోన్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించే వారిని కూడా పక్కనపెట్టి- సొంత నిర్ణయాలను తీసుకుంటోన్నారని, అవన్నీ కూడా టెక్కలిలో పార్టీ ఓటమికి దారి తీస్తాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications