పదో తరగతి జవాబు పత్రాలు మిస్సింగ్: ఉట్నూరులో ఘటన, వారితే తప్పన్న డీఈవో
ఆదిలాబాద్: ఇప్పటికే మొదటి రోజు పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కలకలం రేపిన విషయం తెలిసిందే. మంగళవారం హిందీ పరీక్ష కూడా పేపర్ లీక్ అయిందన్న వార్తలు వచ్చాయి. మరోవైపు, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో పదవ తరగతి తెలుగు పరీక్ష ఆన్సర్ షీట్లు మాయం కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు సమాచారం. అయితే, అధికారులు మాత్రం కేవలం 9 మంది విద్యార్థుల జవాబు పత్రాలు మాత్రమే మిస్సయ్యాయని వెల్లడించారు.

పోస్టల్ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై పర్యవేక్షిస్తున్నారు.
పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే.. ఎవరైనా కావాలని మాయం చేశారా? అనేది పోలీసుల దర్యాప్తుల తేలనుంది. మరోవైపు, మిస్సైన జవాబు పత్రాలు ఏ సెంటర్ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, పదో తరగతి జవాబు పత్రాల మిస్సింగ్ ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఆన్సర్ షీట్ బండిల్ మాయంపై వివరాలు సేకరిస్తోంది. పోస్టల్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే జవాబు పత్రాలు మిస్సయ్యాయని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత తెలిపారు. ఆన్సర్ షీట్ మిస్సింగ్ లో విద్యాశాఖ తప్పిదం లేదన్నారు. కాగా, కనిపించకుండా పోయిన జవాబు పత్రాలు సప్లిమెంటరీ విద్యార్థులవిగా ప్రాథమికంగా గుర్తించారు.












Click it and Unblock the Notifications