తెలంగాణలో ఒమిక్రాన్ వ్యాప్తి: కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులతో 55 చేరిక
హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, మరోసారి భారీగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. సోమవారం కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.

కొత్త కేసులతో తెలంగాణలో 55కు చేరిక
తాజాగా, నమోదైన 12 ఒమిక్రాన్ కేసులతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో 10 మందిలో ఈ కొత్త వేరియంట్ వెలుగుచూడగా, మరో ఇద్దరు కాంట్రాక్ట్ వ్యక్తుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఒమిక్రాన్ బాధితుల్లో 10 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి రాగా, ఒమిక్రాన్ సోకింది. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణైంది.

తెలంగాణలో కొత్తగా 182 కరోనా కేసులు
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 182 కరోనా కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. 181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3417 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.90 శాతంగా ఉంది. మరణాల రేటు 0.59 శాతంగా ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ తన బులిటెన్‌లో పేర్కొంది.

దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కలకలం
కాగా, దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించింది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఇప్పటివరకు 151 మంది ఈ మహమ్మారి వేరియంట్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే, కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేల కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఒమిక్రాన్ కేసులు పెరగడం ప్రజలు, ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications