అమెరికా కష్టాలు: మరో 15మంది విద్యార్థులు వెనక్కి, బాధేస్తోంది: అమెరికా కాన్సులేట్
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు వెళ్లిన పదిహేను మంది తెలుగు విద్యార్థులను న్యూయార్క్ విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు.
బాధిత విద్యార్థులు బుధవారం నాడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎన్నో కలలతో ఎంఎస్ చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు తిరిగి రావడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు.
కాగా, తమ దేశంలో ఉన్నత విద్య కోసం వెళుతున్న తెలుగు విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యను తేల్చేందుకు కృషి చేస్తున్నామని అమెరికా కాన్సులేట్ జనరల్ మైకెల్ ములిన్స్ మంగళవారం తెలంగాణ మంత్రి కెటిఆర్‌తో చెప్పారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారు.
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన అనేకమంది తెలుగు విద్యార్థులను, వీసాలు మంజూరైనా వివిధ కారణాలతో తిప్పి పంపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి, మైకెల్ ములిన్స్‌ను కలిశారు.

అమెరికా వెళుతున్న తెలంగాణ విద్యార్థుల సమస్యల గురించి ఆయనతో చర్చించారు. హైదరాబాద్‌లోని ఎంబసీ నుంచి వీసాలు తీసుకునే విద్యార్థులకు సమస్యలు ఎదురవుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం జేశారు. అమెరికా వెళ్లేందుకు వీసా తీసుకున్న వారిని వెనక్కి పంపటం సరికాదని కాన్సులేట్ జనరల్ దృష్టికి తీసుకొచ్చారు.
ఏవైనా అభ్యంతరాలుంటే వీసా జారీచేసే సమయంలోనే స్పష్టం చేయాలన్నారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. సమస్య తీవ్రతను కాన్సులేట్ జనరల్‌కు తెలియజేశానని, ఈ సమస్య దేశంలోని అన్ని నగరాల విద్యార్థులకూ ఎదురవుతున్నట్లు తెలిపారు.
వీసా కోసం సమర్పించే ధ్రువీకరణ పత్రాల్లో లోటుపాట్లు ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆయన తనతో చెప్పారని, ప్రయివేటు ఏజెంట్ల మోసాలకు గురికాకుండా యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను మరింత విస్తరిస్తామన్నారు.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన పలువురు విద్యార్థులు... విమానాశ్రయం నుంచే వెనక్కు వస్తుండటం ఆవేదన కలిగిస్తోందని, ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఢిల్లీ, వాషింగ్టన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలు, ఢిల్లీలోని భారతీయ విదేశీ వ్యవహారాలశాఖలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తున్నామని మైఖేల్ ములిన్స్ అన్నారు.












Click it and Unblock the Notifications