సినిమా స్టైల్లో..: పట్టపగలు మోండా మార్కెట్లోని నగల షాపులో 2.5 కిలోల బంగారం చోరీ
హైదరాబాద్: ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఐటీ అధికారులమంటూ వచ్చిన కొందరు దుండగులు.. హర్ష జ్యువెలరీ దుకాణంలో రూ. 2.5 కిలోల బంగారం దోచుకుని పరారయ్యారు. ఆ తర్వాత దుకాణ యజమాని ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రద్దీగా ఉండే మోండా మార్కెట్లో ఈ భారీ చోరీ కలకలం రేపింది.
శనివారం ఉదయం ఐదుగురు వ్యక్తులు రద్దీగా ఉండే మోండా మార్కెట్లోని హర్ష జ్యువెలరీ దుకాణానికి వచ్చారు. బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ మూడో అంతస్తులో ఉన్న దుకాణం యజమాని వద్దకు వెళ్లి బెదిరించారు. దుకాణంలో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని సిబ్బందిని మొత్తం పక్కన కూర్చోబెట్టారు. ఇక షాపులో ఉన్న 2.5 కిలోల బంగారానికి సంబంధించిన ఎలాంటి పన్ను చెల్లించలేదని, ఆ బంగారం స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్కడ్నుంచి 2.5 కిలోల బంగారంతో పరారయ్యారు దుండగులు. దీంతో దుకాణ యజమాని ఆ ప్రాంతంలో ఉన్న మిగితా జ్యువెలరీ దుకాణాల యజమానులకు ఐటీ అధికారులు వచ్చి బంగారం స్వాధీనం చేసుకున్న విషయం చెప్పారు. ఐటీ అధికారులు ఇలా వచ్చి తనిఖీ చేయరని.. నోటీసులు ఇస్తారని చెప్పడంతో.. అనుమానం వచ్చిన షాపు యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐటీ అధికారులతో మాట్లాడారు. దీంతో బంగారం స్వాధీనం చేసుకున్న వ్యక్తులు నకిలీ ఐటీ అధికారులని తేలింది. ఈ క్రమంలో సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్లు గుర్తించారు. బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా అసలు ఐటీ అధికారుల్లానే ఈ నకిలీ అధికారులు సోదాలు చేశారని తెలుస్తోంది. కాగా, బంగారం దోచుకున్న అనంతరం నిందితులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కాగా, ఇలాదొంగతనాలు పలు సినిమాల్లో చూపించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీనటుడు సూర్య నటించిన 'గ్యాంగ్’ సినిమాలోని పలు సన్నివేశాల తరహాలో ఈ దొంగతనం జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications