రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలు: వివేక్‌పై ఈడీ కేసు, కీలక వివరాల వెల్లడి
హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వివేక్ ఇళ్లలు, కార్యాలయాల్లో జరిపిన సోదాలపై బుధవారం సాయంత్రం ఈడీ కీలక ప్రకటన చేసింది. రూ. 8 కోట్ల బ్యాంక్ లావాదేవీలపై ఫిర్యాదు అందిందని.. పోలీసుల ఫిర్యాదు మేరకు సోదాలు చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.
విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ సెక్యూరిటీ మధ్య రూ. 100 కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తించారు. అయితే, డబ్బు ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ రాబడి కాదని తేలింది. వ్యాపారం ద్వారా రూ. 20 లక్షల ఆదాయమే వచ్చిందని తెలిపారు. ఆస్తులు, అప్పులు కలిపి రూ. 64 కోట్లతో బ్యాలెన్స్ షీట్ ఉంది. లావాదేవీలు మాత్రం రూ. 200 కోట్లకుపైగా గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు.

కంపెనీలను వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారు. ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని తేలింది. ఎంఎస్ సెక్యూరిటీ సంస్థకు యశ్వంత్ రియల్టర్స్ మాతృ సంస్థ. యశ్వంత్ రియల్టర్స్ లో విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నాయి. వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశంలో సంస్థ ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
సోదాల్లో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కంపెనీ లేకుండా వాటిపై రూ. కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్‌గా తెలుస్తోందని ఈడీ అధికారులు వివరించారు.
వినోద్ ఇంటిపైనా ఈడీ దాడులు
బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. వినోద్ తోపాటు ఆయన అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వినోద్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియం నిర్మాణ పనుల్లో అవినీతిపై తెలంగాణ ఏసీబీ అధికారులు మూడు ఛార్జీషీట్లు దాఖలు చేశారు. ఈ ఛార్జీషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు వినోద్ ఇళ్లు, ఆయన అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కాగా, వివేక్, వినోద్‌లు దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుమారులు.
వినోద్‌పైనా కేసు నమోదు
గడ్డం వినోద్‌పైనా ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణపై కేసు నమోదైంది. గడ్డం వినోద్‌తో పాటు ముగ్గురు క్రికెటర్ల ఇళ్లలో ఈడీ సోదాలు చేసి.. అవినీతి నిరోధక శాఖ మూడు కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. 20 కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలున్నాయి. ఉప్పల్ స్టేడియంలో ఫైర్ ఫైటింగ్ మెటీరియల్‌తో పాటు మెయింటెనెన్స్ పేరుతో నిధుల గోల్‌మాల్ చేశారని, విశాఖ ఇండస్ట్రీకి కాంటాక్ట్ ఇచ్చినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని అభియోగాలున్నాయి.












Click it and Unblock the Notifications