Sudan: సూడాన్ నుంచి భారత్‍కు చేరిన 31 మంది తెలంగాణ వాసులు..
అంతర్గత సంక్షోభంతో అట్టుడుకుతున్న సూడాన్(sudan) నుంచి భారతీయలను రక్షించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ కావేరిలో రెండో బ్యాచ్ శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 17 తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. శుక్రవారం ఆపరేషన్ కావేరి కింద 754 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. రెండు విమానాల్లో ఒకటి ఢిల్లీ, మరొకటి బెంగళూరుకు చేరుకున్నాయి. గురువారం సూడాన్ నుంచి 14 మంది తెలంగాణ వాసులు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ నుంచి మొత్తం 31 మంది సూడాన్ నుంచి భారత్ కు చేరుకున్నారు.
సూడాన్ లో చిక్కున్న భారతీయులను ఇప్పటికి వరకు ఇండియాకు తరలించిన వారి సంఖ్య 1,360కి చేరుకుంది. కాగా శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ వాసులకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ స్వాగతం పలికారు. ఢిల్లీకి వచ్చిన వారిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. వీరిలో కొందరికి తెలంగాణ భవన్‌లో వసతి కల్పించామని, వారిని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సూడాన్ లో దాదాపు 3,000 మంది భారతీయులు ఉన్నారు. వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి ప్రారంభించింది. సూడాన్ లో ఉన్నవారిని జెడ్డాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారత్ కు తరలిస్తున్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రస్తుతం జెడ్డాలో తరలింపు మిషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. శనివారం సౌదీ అరేబియా విదేశీ దేశాలకు చెందిన 66 మంది పౌరులను సూడాన్ నుంచి రక్షించింది. ఇందులో కొంతమంది భారతీయ పౌరులు ఉన్నట్లు తెలిపింది.
WHO ప్రకారం ఏప్రిల్ మధ్య నుంచి సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) పారామిలిటరీ మధ్య జరిగిన పోరాటాల్లో కనీసం 459 మంది మరణించారు.4,000 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు రెండు వారాల పట్టణ పోరాటం విదేశీయుల భారీ వలసలకు దారితీసింది. విదేశీ ప్రభుత్వాలు వేలాది మంది తమ జాతీయులను సూడాన్ నుంచి బయటకు తీసుకురావడానికి రోడ్ కాన్వాయ్‌లు, విమానాలు, నౌకలను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా యూఎస్, సౌది ఆరేబియా మధ్యవర్తిత్వంతో ఇరువర్గాలు కాల్పుల విరమణకు ఆంగీకరించాయి.












Click it and Unblock the Notifications