నిరుద్యోగులకు రేవంత్ గుడ్‌న్యూస్: మరో 35 వేల ఉద్యోగాలు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడే ఫైనల్స్‌లో గెలిచినట్లు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో మహేశ్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించిందన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా తాను 38 నెలలపాటు ప్రజల తరపున పోరాడినట్లు సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వం, పార్టీ జోడెద్దులుగా సాగాలనే ఉద్దేశంతో అధిష్ఠానం బలహీన వర్గాలకు చెందిన మహేశ్‌కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నూతన పీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని జనంలోకి తీసుకెళ్తామని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తోందన్నారు సీఎం రేవంత్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోపే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ రుణం రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దని, అందరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమన్న హరీశ్‌రావు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ మరోసారి సవాల్ విసిరారు.
కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోతేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పామన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వం ఇప్పటికే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న రేవంత్‌రెడ్డి.. ఈ ఏడాది చివరి నాటికి మరో 35 వేల ఉద్యోగ ప్రకటనలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఏడాదిలోనే 65వేల నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పుకొచ్చారు.
ఇక, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అరెకపూడిగాంధీ, కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై పరోక్షంగా స్పందించిన రేవంత్.. మా ఇంటికి వస్తామని బెదిరిస్తే, మావారే వెళ్లి వారి పనిపట్టారన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడు అని ఎవరైనా తోకజాడిస్తే.. ఆయన వెనుక తానున్నానన్న విషయం మరచిపోవద్దని స్పష్టం చేశారు సీఎం రేవంత్.
కాగా, ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు, విజయాలు సెమీఫైనల్స్ మాత్రమేనని రేవంత్ స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసినప్పుడే మనం ఫైనల్స్‌లో విజయం సాధించినట్లు అని.. అప్పటివరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. 1994 నుంచి రాష్ట్రంలో ప్రతిపార్టీ రెండుసార్లు చొప్పున గెలిచిందని, కాంగ్రెస్ కూడా కచ్చితంగా వరసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications