మరికొద్ది నిముషాల్లో పెళ్లి అనగా.. పెళ్లికొడుకును చంపేశారు
కరీంనగర్ : తమ కూతురితో ప్రేమ పెళ్లికి సిద్దమయ్యాడన్న కారణంగా.. మహంకాళి అనిల్(21) అనే యువకుడిని గొంతు కోసి చంపేశారు యువతి కుటుంబ సభ్యులు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ లోని విజయపురి కాలనీకి చెందిన మహంకాళి అనిల్(21) అదే కాలనీకి చెందిన అస్తపురం మౌనిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇదే క్రమంలో నెలన్నర క్రితం ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కూతురు మైనర్ కావడం.. అనిల్ తో ప్రేమ వ్యవహారం ఇష్టలేకపోవడంతో.. అతనిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు యువతి కుటుంబ సభ్యులు.

దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలు పంపించగా ఇటీవలే జైలు నుంచి బయటకొచ్చాడు. ఇంతలో మౌనిక మైనారిటీ కూడా తీరిపోవడంతో.. మరోసారి మౌనికను పెళ్లి చేసుకోవడానికి స్థానిక ఎల్ఎండీ కాలనీలోని తపాల నరసింహ స్వామి ఆలయంలో ఏర్పాట్లు చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో.. తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కూడా ఆశ్రయించారు.
అనంతరం పెళ్లి కోసం సిద్దమవుతోన్న సమయంలో.. యువతి తరుపు బంధువులు ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుని అనిల్ ను తీవ్రంగా చితకబాదారు. అనంతరం కత్తితో అతని గొంతు కోసి హత్య చేసి యువతిని అక్కడినుంచి లాక్కెళ్లిపోయారు. దాడిలో అనిల్ తండ్రికి తీవ్ర గాయాలవడంతో ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం సీపీ కమలాసన్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications