ఆసిఫాబాద్ లో ఆవు అమ్మతనం.. కన్నీరు పెట్టించే కథ!
మానవజాతి లోనే కాదు, పశువుల్లో అయినా, పక్షుల్లో అయినా అమ్మ అమ్మే. అమ్మ ప్రేమకు ఏది సాటిరాదు. జంతువుల సైతం తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. నోరులేని మూగ జీవాలు తమ బిడ్డల మీద ఉన్న ప్రేమ వాటి చర్యలతో తెలియజేస్తాయి. రాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఒక ఆవు లోని అమ్మ ప్రేమకు అద్దం పడుతుంది.
దూడ లేకుండా ఇంటికి ఒంటరిగా చేరిన తల్లి ఆవు
రెండు రోజుల క్రితం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం, ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఇది విన్న ప్రతి ఒక్కరిని హృదయాలను కలచివేస్తుంది. స్థానికుడు భీమ్ రావుకు చెందిన ఆవు, తన దూడతో కలిసి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళింది. పులి దాడిలో దూడ చనిపోగా సాయంత్రం వేళకు దూడ లేకుండా ఆవు ఒంటరిగా ఇంటికి చేరింది.

బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి ఆవు హృదయం
దూడ లేకుండా ఒంటరిగా ఇంటికి వచ్చిన తల్లి ఆవు తల్లడిల్లడాన్ని చూసిన యజమాని హృదయం చలించింది. లేగ దూడ ప్రమాదంలో పడిందని గ్రహించి, ఆ యజమాని తక్షణం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. మరుసటి రోజు ఉదయం ఎఫ్ఆర్వో ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఉన్న అటవీ అధికారులు భీమ్ రావు వద్దకు వచ్చి విషయం తెలుసుకున్నారు.
అటవీ అధికారుల గాలింపు.. అధికారులకు దారి చూపిన తల్లి ఆవు
అతను ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన అటవీ అధికారులకు దూడ ఆచూకీ కనిపించలేదు. ఎక్కడా దూడ ఆచూకీ లభించకపోవడంతో అటవీ అధికారులు తిరిగి భీమ్ రావు వద్దకు వచ్చారు. తన బిడ్డ కోసం తల్లడిల్లుతున్న ఆవును చూసిన యజమాని దానిని అడవిలోకి వదిలిపెట్టాడు. దీంతో అది సుమారు కిలోమీటర్ దూరం వెళ్లి ఒకచోట ఆగింది. అక్కడే అటవీ అధికారులు దూడ కళేబరాన్ని గుర్తించారు.
తల్లి ఆవు బాధ చూసి కన్నీరు పెట్టుకున్న స్థానికులు
పులి దాడిలో దూడ మరణించినట్లుగా నిర్ధారించిన అధికారులు, రైతుకు త్వరలోనే తగిన పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే లేగ దూడ మృతితో తల్లడిల్లుతున్న, తీవ్ర ఆవేదన పడుతున్న ఆవును చూసిన భీమ్ రావు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు. పులి దాడిలో బలైపోయిన తన బిడ్డ కోసం తల్లి ఆవు అటవీ అధికారులకు దారి చూపించిన వైనం ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఆవు ప్రేమను అర్థమయ్యేలా చెబుతుంది. అందరి కళ్ళు చెమర్చేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications