సినీ హీరోయిన్ కావాలనే మోజులో అమ్మాయి: పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ఇలా..
హైదరాబాద్: సినిమా హీరోయిన్ కావాలనే మోజుతో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటి ముందు తచ్చాడుతున్న ఓ యువతి పోలీసులకు పని కల్పించింది. ఈ సంఘటన గురువారంనాడు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో జరిగింది.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి నర్సంపేటలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. సినిమాల్లో ప్రవేశించాలనే కోరికతో ఆమెకు పూరీ జగన్నాథ్ అంటే అభిమానం.
ఆయన సినిమాలో హీరోయిన్ కావాలని భావించి ఇంట్లో చెప్పకుండా బుధవారం సాయంత్రం నేరుగా వరంగల్ నుంచి హైదరాబాదులోని ఫిలింసిటీకి వచ్చేసింది. అర్థరాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న యువతిని అటు వైపు నుంచి వస్తున్న ఆనంద్ అనే టాక్సీ డ్రైవర్ చూసి వివరాలు అడిగాడు.

తాను పూరి జగన్నాథ్ నివాసానికి వెళ్లాలని చెప్పడంతో అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో టాక్సీలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 31లోని పూరి జగన్నాథ్ ఇంటి ముందు దిగబెట్టాడు. తెల్లారేవరకు నిద్రాహారాలు మాని పూరి కోసం వేచి చూసింది.
అయితే గత రాత్రి అక్కడ అనుమానాస్పదంగా సంచరించిన ఆ యువతిపై సెక్యూరిటీ గార్డులు కూడా అనుమానపడ్డారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని తండ్రి హనుమాన్ సింగ్‌ను పిలిపించారు అర్థరాత్రి ఒంటరిగా జాతీయ రహదారిపై నిలపడడమే కాకుండా అదే రాత్రి జూబ్లీహిల్స్‌లోని పూరి జగన్నాథ్ ఇంటి వద్ద తచ్చాడడం పోలీసులకు కంగారు పెట్టింది.












Click it and Unblock the Notifications