ల్యాబ్ అసిస్టెంట్ లైంగిక వేధింపులు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, నిందితుడి అరెస్ట్
రంగారెడ్డి: ఓ ఆకతాయి నుంచి ఎదురైన లైంగిక వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించటంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. విద్యార్థిని బంధువులు ఆకతాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో చోటుచేసుకొంది. అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(సివిల్) చివరి సంవత్సరం చదువుతున్న సురేష్‌నాయక్ కళాశాల ఆవరణలోని మరో కళాశాలలో ల్యాబ్ సహాయకుడిగా కూడా పనిచేస్తున్నాడు.
అదే కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థినిని గత సంవత్సర కాలంగా పరీక్షల సమయంలో వేధిస్తున్నాడు. ల్యాబ్ సహాయకుడిగా ఉన్న అతను సంబంధిత సబ్జెక్టులో మార్కులు తగ్గిస్తానని బెదిరిస్తున్నాడు.

శనివారం సాయంత్రం కళాశాల సమీపంలోని వసతిగృహానికి వెళ్తున్న విద్యార్థినిని సురేష్ మార్గమధ్యలో అటకాయించాడు. ఆమెను ఉద్దేశించి పరుషంగా మాట్లాడటమే కాకుండా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆవేదనకు గురైన విద్యార్థిని వసతి గృహానికి వెళ్లి ఫినాయిల్ తాగింది.
గమనించిన తోటివిద్యార్థినులు వసతి గృహం నిర్వాహకులతో కలిసి ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆమె సంబంధీకులు ఆదివారం ఉదయం సురేష్‌నాయక్‌ను కళాశాల వద్ద గుర్తించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications