ప్రేమ వేధింపులు భరించలేక.. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
నల్గొండ: జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం లింగాల గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎ శ్రావణిని అదే గ్రామానికి చెందిన మేకల వినోద్ గత నెలరోజులుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ వేధింపులు తాళలేక శ్రావణి సోమవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని సూర్యాపేట ప్రాంతీయ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి రామలింగయ్య ఫిర్యాదు మేరకు వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
మహబూబ్‌నగర్ జిల్లా పల్లెపాడ్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. పల్లెపాడ్ గ్రామానికి చెందిన ఆంజనేయులుకు జల్లాపురం గ్రామానికి చెందిన పద్మతో కొన్ని సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు.
అయితే గత మూడునెలల నుంచి ఆంజనేయులు భార్యను అనుమానంతో వేధింపులకు గురి చేశాడు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి భార్యతో గొడవపడి ఆమె తలపై గొడ్డలితో బలంగా కొట్టాడు. తీవ్రగాయాలైన పద్మను చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు సోమవారం ఉదయం మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అలంపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications