భర్త కర్కశత్వం: బాత్రూం నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రను చేసి దాడి, ఆత్మహత్య
హైదరాబాద్: కట్టుకున్న భర్తే రాక్షసుడిలా ప్రవర్తించాడు. చిన్న కారణానికే ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతేగాక, కుటుంబసభ్యుల ఎదుటే వివస్త్రను చేసి ఆమెను తీవ్ర అవమానానికి గురిచేశాడు. క్షమించమని ఎంత వేడుకున్నా.. ఆ దుర్మార్గుడి హృదయం కరగలేదు. ఇంత జరుగుతున్నా.. అత్తామామలు, తోడికోడళ్లు చూస్తూనే ఉన్నారు తప్ప, అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. అత్తామామలు కూడా అతనికి వంతపాడటం విచారకరం. ఈ ఘోర అవమానాన్ని బరించలేక ఆ వివాహిత కన్నవారికి కడసారి సందేశం పంపి, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సుశృత (30)కి పూసలబస్తీకి చెందిన నూతలగంటి మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. అయితే, కొద్ది రోజులుగా భర్తతోపాటు అత్త మామలు సుశృతను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి తీవ్రంగా వేధిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం సుశృత స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకుంది. అనంతరం స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. ఇంతలో వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్‌ను ఎక్కువసేపు ఉపయోగించిందంటూ అత్తమామలు ఆమె భర్తను ఉసిగొల్పారు. దీంతో అతడు బాత్రూంలో స్నానం చేస్తుండగానే సుశృతను కొట్టాడు. తప్పయిపోయిందని, క్షమించాలని వేడుకున్నా ఊరుకోలేదు.

బాత్రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత వివస్త్రగా ఉండగానే మళ్లీ కొట్టాడు. ఇంట్లో అత్తమామలు, తోడి కోడలు, ఆమె పిల్లలు చూస్తుండగా ఒంటిపై దుస్తులు లేకపోయినా విచక్షణరహితంగా కొట్టాడు. తప్పైందని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. మరోసారి వాటర్ హీటర్ వినియోగించనని ప్రాధేయపడినా వినలేదు.
వివస్త్రగా ఉన్న ఆమెపై తీవ్రంగా కొట్టాడు. జరిగిన ఘోర అవమానాన్ని తట్టుకోలేక ఆమె తన తల్లిదండ్రులకు మొబైల్‌లో మెసేజ్ పెట్టింది. అవమానం భరించలేక సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, సుశృత తల్లిదండ్రులు ఆమెది ఆత్మహత్య కాదని భర్త, అత్తమామలే చంపారని ఆరోపిస్తున్నారు. ఆమె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ కూతురును కొట్టి చంపారంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications