పెళ్లింట విషాదం: తండ్రి మృతి, గంటల్లోనే 11లక్షల నగదు, గోల్డ్ చోరీ
హైదరాబాద్: కష్టాలకే కన్నీళ్లు తెప్పించే ఘటన ఇది. కూతురు తెల్లారితే పెళ్లనగా తండ్రి ప్రాణాలు వదిలాడు. ఆయన అంత్యక్రియల కోసం ఇంటిల్లిపాది తీవ్రశోకంలో వెళితే.. వచ్చేసరికి ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును దోచేశారు దొంగలు. దీంతో ఇంటి పెద్ద పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబసభ్యులను మరింత కుంగిపోయారు. ఈ విషాద ఘటన నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి డీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురిలో నివాసముండే సింగిరెడ్డి లక్ష్మారెడ్డి(54) అనే వ్యాపారి కూతురు వివాహం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి కుమారుడి తరపు బంధువులు బుధవారం భోజనానికి వస్తున్నట్టు కబురు చేశారు.
ఈ సమయంలో వరపూజ నిర్వహించి వరుడికి కట్నం కింద కొంత డబ్బు ఇవ్వాలని లక్ష్మారెడ్డి భావించారు. అందుకోసం డబ్బులు తెచ్చి ఇంట్లో భద్రపరిచారు. అయితే ఆ శుభకార్యం చూడకుండానే మంగళవారం రాత్రి లక్ష్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.

కాగా, మృతదేహాన్ని కుషాయిగూలోని మల్లారెడ్డి కాంప్లెక్సులో సొంత ఇంటికి తరలించారు. వీరి ఇంటికి ఆనుకుని ఉన్న గదిలో లక్ష్మారెడ్డి తల్లి సత్తెమ్మ ఉంటోంది. వివాహం కోసం తెచ్చిన రూ.11 లక్షల నగదు, పదహారున్నర తులాల బంగారు నగలను సత్తెమ్మ తన ఇంట్లోని బీరువాలో ఉంచింది.
కుటుంబమంతా ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉంటే.. దొంగలు సత్తెమ్మ గది తాళాలు పగులగొట్టి బీరువాలో ఉంచిన నగదు, నగలను ఎత్తుకెళ్లారు. దహన సంస్కారాలు పూర్తి చేసి కుటుంబసభ్యులు ఇంటికి తిరిగివచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీసీ రమేష్‌నాయుడు, కుషాయిగూడ ఏసీపీ సయ్యద్‌రఫీక్, డీసీఐ ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి సందర్శించారు. కాగా, పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications