ఘోరం: వ్యభిచారం చేయమంటూ భర్త, అత్తామామల వేధింపు, ఆత్మహత్య
హైదరాబాద్: భర్త పెట్టే వేధింపులకు తాళలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసముంటున్న వివాహితకు ఇటీవల ఆడపిల్ల జన్మించింది. దీంతో పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలని భర్తతోపాటు అత్తామామల నుంచి వేధింపులు మొదలయ్యాయి. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో వ్యభిచారం చేసైనా డబ్బులు సంపాదించిపెట్టాలని ఆమెను వేధించారు.

ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన సదరు వివాహిత బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్తతోపాటు అత్తామామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications