జిమ్ నుంచి ఇంటికొచ్చి కుప్పకూలిన యువకుడు, గుండెపోటుతో మృతి
హైదరాబాద్: ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న యువకుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, ఖమ్మంలో ఓ యువకుడు గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాధా కిషోర్ కుమారుడు శ్రీధర్(31) గుండె పోటుతో మృతి చెందాడు.
సోమవారం ఉదయం జిమ్‌కు వెళ్లి ఇంటికి తిరిగివచ్చిన శ్రీధర్.. ఛాతిలో నొప్పి వస్తుందంటూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రీధర్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కాగా, ఆదివారం శ్రీధర్ సోదరుడి కుమారుడి బారాసాల జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి హాజరయ్యారు. వేడుక జరిగిన మరుసటి రోజే శ్రీధర్ మరణించడంతో ఆ కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నవయస్సులోనే గుండెపోటుతో శ్రీధర్ మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. శీధర్ మృతితో వారి కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు, ఆదివారం గరికపాటి నాగరాజు అనే 32 ఏళ్ల యువకుడు కూడా గుండెపోటుతో మరణించాడు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించడంతో ఖమ్మం నగరంలో విషాదం నెలకొంది. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న యువకుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది.
సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, మారుతున్న జీవన శైలి కారణంగానే యువత గుండెపోటు బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అవసరానికి మించిన వ్యయామం కూడా గుండె వేగాన్ని పెంచుతుందంటున్నారు. జంక్ ఫుడ్, నూనెలు ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications