పని ఒత్తిడి భరించలేక.. బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
ఆదిలాబాద్: పని ఒత్తిడి భరించలేక.. ఓ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్‌లో పని భారం ఎక్కువగా ఉందని.. ఇద్దరు చేసే పని తానొక్కడినే చేస్తున్నానని పలుమార్లు భార్యతో పంచుకున్న బ్యాంక్ మేనేజర్.. చివరకు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేష్(35) ఆగస్టు 17న విధులు పూర్తయ్యాక.. రాత్రి 7.30 గంటల సమయంలో కార్యాలయంలోనే ముందుగా తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అనంతరం వాంతులు చేసుకున్నాడు.

ఈ విషయాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది ఏమైందని ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పారు సురేష్. ఈ క్రమంలో సిబ్బంది వెంటనే ఆయనను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసిఫాబాద్‌లో ఉంటున్న భార్య, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, మెరుగైన వైద్యం కోసం సురేష్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ్నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. బ్యాంకులో పనిభారం ఎక్కువైందని భార్య ప్రియాంకతో తరచూ చెబుతుండేవాడని.. పని ఒత్తిడి కారణంగానే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తండ్రి లక్ష్మీరాజం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications