హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో తాపీ మేస్త్రీ జాబ్: రూ. లక్షల్లో వార్షిక వేతనం
హైదరాబాద్: నగరంలోని అమెరికా కాన్సులేట్ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఉద్యోగ ప్రకటనలో భర్తీ చేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. తాపీ మేస్త్రీకి భారీగా జీతం ప్రకటించడం ఇతర ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. తాపీ మేస్త్రీలకు సాధారణంగా 800-1200 వరకు రోజుకు వేతనం ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన నెలకు 30-40 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోని యూఎస్ ఎంబసీ మేసన్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో జీతాల వివరాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తాపీ మేస్త్రీ వార్షిక వేతనం ఏకంగా రూ. 4,47,348 పేర్కొన్నారు. అంటే నెలవారీ జితం లెక్కన చూస్తే మేస్త్రీ జీతం రూ. 37,729గా నిర్ణయించారు. జీతంతోపాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి. ఈ ఉద్యోగాన్ని ఫుల్ టైమ్ జాబ్‌గా పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి అర్హులైన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

అంతేగాక, అమెరికా కాన్సులేట్‌లో శాశ్వత ఉద్యోగంగా పేర్కొంది. అయితే, ప్రొబేషనరీ పీరియడ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి వారానికి 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్, బ్యాక్ గ్రౌండ్ వెరికేషన్ తర్వాత 4 నుంచి 8 వారాలు ఉంటుంది.
విధుల్లో భాగంగా కొత్త గోడల నిర్మాణం, కాంక్రీటు సహా రాతి పనులు చేయాల్సి ఉంటుంది. కనీసం ఈ వృత్తిలో రెండేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పనిలో అనుభవంతోపాటు వివిధ పనులకు సంబంధించిన మెటీరియల్ ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలి. ఇక, మేసన్ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 25ను గడువుగా పెట్టారు. అభ్యర్థి కనీసం 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి. లెవల్ 1 ఇంగ్లీష్ ప్రావీణ్యం పరీక్షించబడుతుంది. తెలుగు, హిందీలో లెవల్ 3 వరకు ప్రావీణ్యం పరిగణించబడుతుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. సెక్యూరిటీ క్లియరెన్స్‌లలో అర్హత సాధించాలి. మరోవైపు, హెల్పర్ ఉద్యోగానికి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 11 లోగా వీటికి దరఖాస్తులు చేసుకోవాలి. వార్షిక వేతనం రూ. 3,84,265 చెల్లిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు సెమీ స్కిల్ టాస్క్‌లు తెలిసి ఉండాలి. మరికొన్ని ఉద్యోగాలకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటరీ, ఇతర పనులలో అనుభవం ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.












Click it and Unblock the Notifications