అసదుద్దీన్ ఓవైసీ సంచలనం-లాక్‌డౌన్ వద్దు, వ్యాక్సిన్లు ఇవ్వండి-కేసీఆర్‌ను ఉద్దేశించి తొలిసారి తెలుగులో ట్వీట్లు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు మిత్రుడిగా ఉంటూనే.. కాంగ్రెస్ దాదాపు బలహీనపడిన వేళ ప్రతిపక్ష పాత్రలోనూ ఎంఐం పార్టీ రంజింపజేస్తున్నది. కీలకమైన అంశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలను తూర్పారాపడుతోన్న మజ్లిస్ తాజాగా లాక్ డౌన్ పొడగింపును కూడా వ్యతిరేకిస్తున్నది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను పొడగించే అంశమై ఆదివారం కేబినెట్ భేటీ అయిన సందర్భంగా మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు తొలిసారి తెలుగులో ట్వీట్లు చేశారు..

లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గవు
''కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. లాక్‌డౌన్‌పై నా వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేస్తున్నా. ఈ ప్రక్రియతో పేదల జీవితాలు నాశనమవుతాయి. లాక్ డౌన్ కంటే (మే 12) ముందు నుంచి కోవిడ్ కేసులు తగ్గుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. లాక్ డౌన్ వల్లే కేసులు తగ్గలేదు. లాక్ డౌన్ లేకపోయినప్పటికీ కోవిడ్‌ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి..

వ్యాక్సినేషనే సొల్యూషన్
కొవిడ్ మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం చేయాలన్న వాస్తవాన్ని అందరమూ అంగీకరించాలి. మాస్కుల వినియోగం, భౌతికదూరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే పోరాడవచ్చు. అందుకు అనుగుణమైన జీవనవిధానం ఉండేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలి. మహమ్మారికి ధీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమే. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. మహమ్మారి,పేదరికం,పోలీసుల వేధింపులతో చాలా ఇక్కట్లలో పడతారు. కాబట్టి..

సంక్షోభాన్ని శాంతిభద్రతల సమస్యగా?
ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతి, భద్రతల సమస్యగా మారుస్తున్నాయి. ఇది ఎంత మాత్రం శాస్త్రీయ దృక్ఫథంకాదు, మానవతా కోణం అంతకన్నా కాదు. లాక్ డౌన్ పొడిగించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రిని నేను గట్టిగా కోరుతున్నాను. బహిరంగ ప్రదేశాల్లో జనసమ్మర్దాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ విధించాలి లేదా కోవిడ్ క్లస్టర్లలో మినీ లాక్ డౌన్ విధించాలి.
కానీ, కేవలం 4గంటల సడలింపులతోనే 3.5కోట్ల మంది జీవనం వారాల పాటు కొనసాగించాలని భావించడం తగదు..'' అని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. లాక్ డౌన్, వ్యాక్సినేషన్ పై హైదరాబాద్ ఎంపీ అభిప్రాయంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఏకీభవిస్తున్నారు. మజ్లిస్ అధినేత తెలుగులో ట్వీట్ చేయడాన్ని హర్షిస్తూ.. రీట్వీట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications