అసదుద్దీన్ ఒవైసీకి షాకిచ్చిన హ్యాకర్లు: ఆయన ఫొటో.. పేరు స్థానంలో
హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి హ్యాకర్లు షాకిచ్చారు. దేశంలో కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్రబిందువుగా మారిన టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు. ట్విట్టర్ సెక్యూరిటీ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. దీనికి ఏఐఎంఐఎం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే దుందుడుకు చర్యలతో నిషేధాన్ని ఎదుర్కొంటోన్న ట్విట్టర్.. మరోసారి అదే రీతిలో వార్తల్లోకి ఎక్కినట్టయింది.
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వాన్ని వహిస్తోన్న ఏఐఎంఐఎం అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అందులో డిస్‌ప్లే ఇమేజ్‌గా ఉన్న మజ్లిస్ ఎన్నికల గుర్తు గాలిపటాన్ని తొలగించారు. డిస్‌ప్లే పేరునూ మార్చివేశారు. వాటి స్థానంలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టెస్లా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ చీఫ్ ఇంజినీర్ ఎలాన్ మస్క్ ఫొటో, పేరును పొందుపరిచారు. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఏఐఎంఐఎం ధృవీకరించింది.

ఇదివరకు డిస్‌ప్లే ఇమేజ్‌గా పార్టీ ఎన్నికల గుర్తు గాలిపటం ఉండగా.. ఇప్పుడు హ్యాకర్లు దాని స్థానంలో ఎలాన్ మస్క్ ఫొటో పెట్టారు. పేరును కూడా మార్చివేశారు. ఏఐఎంఐఎం అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ రెండు మార్పులు తప్ప మరేవీ చోటు చేసుకున్నట్లు కనిపించట్లేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాతబస్తీలో అసదుద్దీన్ ఒవైసీ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు యధాతథంగా ఉన్నాయి.
భారీ వర్షాల వల్ల జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో ఇదివరకు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేసిన పర్యటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల జోలికి పోలేదు హ్యాకర్లు. డిస్‌ప్లే ఇమేజ్, పేరును మాత్రమే మార్చివేశారు. దీనిపై ఏఐఎంఐఎం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? లేదా? అనేది తెలియరావాల్సి ఉంది. ఐటీ యాక్ట్ ఉల్లంఘన కింద ఇప్పటికే పలు ఆరోపణలను ఎదుర్కొంటోంది ట్విట్టర్ యాజమాన్యం. తాజాగా ఈ హ్యాకింగ్ ఘటనలో సెక్యూరిటీ సిస్టమ్‌లోనూ లోపాలు ఉందనే విషయం బయటపడినట్టయింది.












Click it and Unblock the Notifications