ఒవైసీపై హత్యాయత్నం: హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత: మజ్లిస్ భారీ ప్రదర్శన
హైదరాబాద్: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న ఈ దశలో ఆయనపై కాల్పులకు పాల్పడటం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటన అనంతరం- పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను మోహరింపజేశారు. చారిత్రాత్మక చార్మినార్, మక్కా మసీదు, మదీన, పత్తర్‌గట్టి, గుల్జార్ హౌజ్, షహ్రాన్ మార్కెట్, లాడ్ బజార్, ఖిల్వత్, లాల్ దర్వాజ, ఛత్రినాక, చంద్రయాన్ గుట్ట, హుస్సేనీ అలం, షాలిబండ, ఫలక్‌నుమా, యాకుత్ పురా, రెయిన్ బజార్, శాస్త్రి నగర్ తదితర ప్రాంతాలలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సౌత్ జోన్ ఇన్‌ఛార్జ్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ గజారావ్ భూపాల్ స్వయంగా అక్కి భద్రతను పర్యవేక్షించారు. కాగా- శుక్రవారం ప్రార్థనల అనంతరం మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టారు. వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రార్థనలను ముగించుకున్న వెంటనే రోడ్ల మీదికి వచ్చారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తోన్న కారుపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ర్యాలీ తరలి వెళ్లారు.
ఒవైసీపై కాల్పులకు నిరసనగా చార్మినార్ వద్ద మజ్లిస్ కార్యకర్తల నిరసన ప్రదర్శన...#mim #owaisiparty #asaduddinowaisi #telangana #charminar #oneindiatelugu pic.twitter.com/0GMOWAZwin
— oneindiatelugu (@oneindiatelugu) February 4, 2022
ఈ ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వారు నినదించారు. దీనితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈ పరిస్థితిని ఉండొచ్చని ముందే ఊహించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శలను నిర్వహిస్తున్నామని మజ్లిస్ నాయకులు స్పష్టం చేశారు. నిందితులు ఎంతటి వారైనా వదిల పెట్టొద్దంటూ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications