చిరంజీవి గారు.. ఇక ఆపేయండి: మెగాస్టార్‌కు చేదు అనుభవం..!!
హైదరాబాద్: దసరా పండగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఇవ్వాళ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమం సందడిగా సాగింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు దీనికి హాజరయ్యారు. ఒకే వేదికపై సందడి చేశారు. వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దఫా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. డోలు కొట్టి ప్రారంభించారు.

సందడిగా..
ప్రతి సంవత్సరం విజయదశమి ముగిసిన మరుసటి రోజే బండారు దత్తాత్రేయ కుటుంబం ఈ కార్యక్రామాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 17 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తోందాయన కుటుంబం. ఈ సారి కూడా ఆ ఆనవాయితీని తప్పలేదు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీలు జీ వివేక్, వీ హనుమంతరావు, మాజీ మంత్రి బాబూ మోహన్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్..
అలయ్ బలయ్ వేడుకల్లో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దత్తాత్రేయ కుటుంబం 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోండటం గొప్ప విషయమని, ఇలాంటి మంచి ప్రోగ్రామ్‌లు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా, రాజకీయాలకు అతీతంగా జరిగే ఆత్మీయ కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు.

ఫొటోల కోసం ఎగబడ్డారు..
చిరంజీవి హాజరు కావడం వల్ల ఆయనతో ఫొటో దిగడానికి ఆహ్వానితులు ఎగబడ్డారు. పలువురు మహిళలతో ఆయన ఫొటోలు దిగారు. వేదిక మీద ఆయనను చుట్టుముటారు. సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. అదే సమయంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఎవరూ ఆసక్తిగా వినకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవితో ఫొటోలు తీసుకుంటూ ఉండటంతో తన ప్రసంగాన్ని నిలిపివేశారు.

ఫొటో సెషన్‌తో చిరాకు..
అక్కడ ఫొటో సెషన్ ఆగిపోతేనే తాను ప్రసంగిస్తానని తేల్చి చెప్పారు. లేదంటే తాను వెళ్లిపోతానని, తనకెలాంటి మొహమాటాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవి గారు! దయచేసి మీరు ఫొటో సెషన్ ఆపేసి, ఇటు పక్కకు రావాలి.. అప్పుడే నేను మాట్లాడతాను.. అంటూ నేరుగా మెగాస్టార్‌ను ఉద్దేశించి చెప్పారు. కొద్దిసేపటికి చిరంజీవి అటుగా వచ్చారు. గరికపాటి నరసింహారావు పక్కనే కొద్దిసేపు కూర్చున్నారు.












Click it and Unblock the Notifications