ఎమ్మెల్యేకు షాకిచ్చిన అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కొద్దిరోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో అంబటి రాయుడు హడావిడి కనిపించింది. అంబటి రాయుడు ఎన్నికల ముందు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. దీంతో అంబటి వైసీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అందరూ అనుకున్నట్టుగానే జగన్ సమక్షంలో పార్టీలో చేరారాయన. ఆ వెంటనే వైసీపీకి షాకిస్తూ.. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
గతేడాది డిసెంబర్‌లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు..జనవరి 6న ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే గుంటూరు ఎంపీ సీటుపై హామీ దక్కకపోవడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చేశారనే వార్తలు తెర మీదకు వచ్చాయి. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పిన అంబటి రాయుడు అనూహ్యంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి మద్దతిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి కొన్నిచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించడంలో అంబటి రాయుడు పాత్ర కూడా ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా అంబటి రాయుడు హాట్ టాపిక్‌గా మారారు. అంబటి రాయుడుకు హైదరాబాద్‌లో ఇంటి స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. క్రికెటర్ మహ్మద్ సిరాజ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు 600 చదరపు గజాల చొప్పున హైదరాబాద్‌లో ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాలకు కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన డిమాండ్ పై అంబటి రాయుడు స్పందించారు. తనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇంటి స్థలం అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు కూడా ఇంటి స్థలం ఇవ్వాలని తన పేరును చేర్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర క్రీడాకారులకు ఇంటి స్థలాలు కేటాయించడం పట్ల అంబటి రాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడే కాదు గతంలోనూ తాను ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఆశించలేదని అంబటి రాయుడు గుర్తు చేశారు. తనకు ఇంటి స్థలం అవసరం లేదన్నారు. ఇంటి స్థలం అవసరం ఉన్న ఇతర క్రీడాకారులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications