రేవంత్ ముందున్న దారి అదొక్కటే - చంద్రబాబు సలహా..!!
తెలంగాణ లో అసలు సిసలు కాంగ్రెస్ రాజకీయం మొదలైంది. కుర్చీలు లాగే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి. రేవంత్ రాకతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ అన్నారు. కొద్ది రోజులు బాగానే ఉంది. ప్రత్యర్ధి పార్టీల కంటే సీనియర్లతోనే అసలు సమస్య మొదలైంది. హైకమాండ్ ఇప్పటి వరకు అండగానే నిలిచింది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సీనియర్లంతా రేవంత్ పైన తిరుగుబాటు బావుటా ఎగుర వేసారు. హైకమాండ్ రాజీ చేసినా అది తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. రేవంత్ కొనసాగినా సహకారం సాధ్యమయ్యేలా లేదు. అటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇది రేవంత్ రాజకీయ భవిష్యత్ కు కీలక సమయం. మరి..రేవంత్ ఏం చేయబోతున్నారు. రేవంత్ రాజకీయ గురువు చంద్రబాబు ఈ సమయంలో శ్రేయోభిలాషిగా ఇచ్చే సలహా ఏంటి.

రేవంత్ పదవికి ఢోకా లేదు, కానీ అక్కడే అసలు సమస్య
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే కార్యకర్తల్లో నైరాశ్యం వచ్చింది. తెలంగాణ ఇచ్చినా ఇప్పటి వరకు కనీసం గుర్తింపు దక్కేలా ప్రజా తీర్పులు రాలేదు. ఉప ఎన్నికల్లో డిపాజిట్ల కోసం పోరాడాల్సి వస్తోంది. పార్టీకి ఓట్లు సాధించే ప్రజాకర్షణ ఉన్న నేతలు లేరు. ప్రభుత్వ వ్యతిరేక..పార్టీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ పైన ఆధార పడి నేతలు రాజకీయం చేస్తున్నారు. టీఆర్ఎస్ - బీజేపీకి ధీటుగా తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపించటం లేదు. ఆ రెండు పార్టీలకు పొలిటికల్ గ్రౌండ్ వదిలేసిన కాంగ్రెస్ నేతలు ఆధిపత్యం - వర్గ పోరుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హైకమాండ్ విధేయత పేరుతో రాజకీయం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం పైన విధేయత ఉన్నా.. ప్రజల్లో ఆదరణ ఉన్నా..దానిని ఓట్టుగా మలిచే నేతలెవరు. రేవంత్ కు సీనియర్లు ఇక సహకరించే పరిస్థితి లేదు. సీనియర్లు కోరుకుంటున్నట్లుగా టీపీసీసీ సారధ్య భాధ్యతల నుంచి రేవంత్ ను తప్పించే అవకాశం లేదు. ఎన్నికల వరకు తాత్కాలకి సర్దబాట్లు.. టికెట్ల కేటాయింపుల వేళ ఇదే తరహా పంచాయితీల సూచనలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పార్టీ కమిటీల్లో స్థానాలతో పంచాయితీ
పార్టీ కమిటీల నియామకంలో న్యాయం జరగలేదనేది సీనియర్ల వాదన. అసలు పార్టీపై అంత అంకిత భావం ఉన్న నేతలకు పదవులతో పనేంటనేది అసలు ప్రశ్న. ఆ పదువులతో వచ్చే హోదా ఏంటి. పార్టీలో ఒర్జినల్ - వలసవాదుల విభజన తీసుకొచ్చారు. దీంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి ఎన్నికల వేళ రాకుండా అడ్డు వేస్తున్నారు. వస్తే వారంతా వలసవాదులే అవుతారు. ఒర్జినల్ కాంగ్రెస్ వాదుల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేదెవరు. రేవంత్ వచ్చిన తరువాత కొంత కాలం పార్టీలో జోష్ కనిపించినా.. ఇప్పుడ అదీ లేదు. ఒకరిపై మరొకరు కోవర్టు ముద్ర. రేవంత్ స్థానికంగా లౌక్యం- నాయకత్వంతో అందరినీ కలుపుకొని పోవటం కంటే ఢిల్లీ నుంచి పార్టీ పై పట్టు సాధించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో ఎప్పటి నుంచో ఈ సీనియర్లకు ఈ రాజకీయం బాగా తెలుసు. దీంతో, ఇప్పుడు రేవంత్ ను ఢిల్లీ నుంచే ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఒక వేళ ఢిల్లీ నేతలు ఈ సీనియర్లను కూల్ చేసి..పంపినా..రేవంత్ కు సూచనలు చేసినా.. ఎన్నికల వరకు పార్టీకి మేలు చేసే బంధం అనేది అనుమానమే. మరి.. ఈ పరిస్థితుల్లో రేవంత్ రాజీ పడతారా.. కొత్త నిర్ణయం తీసుకుంటారా అనేదే ఆసక్తికర అంశం.

రేవంత్ ముందున్న ప్రత్యామ్నాయం..అదొక్కటేనా
రేవంత్ కు ఒకరిద్దరి నేతలు ముందకొచ్చి సీనియర్లను కౌంటర్ చేస్తున్నా...అది పెద్దగా ఉపయోగం కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో రేవంత్ పార్టీ సారధ్యంలో కొనసాగుతారా. లేక మరో ఆలోచన చేస్తారా. రాజకీయంగా ఆయనకు టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం లేదు. బీజేపీలోకి గతంలోనే ప్రయత్నించినా..ఇప్పుడు అక్కడకు వెళ్లినా జూనియర్ గా ఉండాల్సిందే. టీడీపీలోకి తిరిగి వెళ్లినా తెలంగాణలో ఉపయోగం లేదు. కాంగ్రెస్ లోనే సర్దుకుపోయినా..మొండిగా ముందుకెళ్లినా ప్రతీ రోజు ఇంటి పోరు తప్పేలా లేదు. దీంతో, రేవంత్ సొంత పార్టీ పెడితే.. ఉన్న క్రేజ్..కలిసొచ్చే వారితో ముందుకెళ్తే.. కనీసం రాజకీయంగా నిలబడిన వారవుతారు. కానీ, కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చేందుకు మరో వేదికగా మారుతుంది. కానీ, వ్యక్తిగతంగా ఇప్పుడు రేవంత్ కు తన సామర్ధ్యం చాటుకోవటం అవసరంగా కనిపిస్తోంది. మరి..రేవంత్ ఏం చేస్తారు..రాజకీయంగా తాను గౌరవించే టీడీపీ అధినేత చంద్రబాబు సలహా తీసుకుంటారా.. అడిగితే..చంద్రబాబు ఈ కష్ట సమయంలో రేవంత్ శ్రేయోభిలాషిగా ఏం చెబుతారు.. ఇప్పడు ఈ మొత్తం ఎపిసోడ్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డిబేట్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications