రాహుల్ ఆరాటం వారి కోసమే..! బీజేపీ జైత్రయాత్ర ఆపలేరు-హైదరాబాద్ లో అమిత్ షా..!
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ హైదరాబాద్ లో నిర్వహించిన మహాపాదయాత్రలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) .. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో భాగ్యలక్ష్మి అమ్మవారితో పాటు సర్దార్ పటేల్ ను గుర్తు చేస్తూ తన ప్రసంగం ప్రారంభించారు. సర్దార్ పటేల్ అప్పట్లో నిజాం నవాబును గద్దె దించకపోతే హైదరాబాద్ భారత్ లో కలిసేది కాదని అమిత్ షా తెలిపారు. హైదరాబాద్ లో వేల మంది రోడ్లపైకి వచ్చారని, నిన్న ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించారని, అది ఓటు కాపాడే సభ అన్నారని, కానీ అది వలసదారుల్ని రక్షించే సభ అన్నారు. కాంగ్రెస్ ఎస్ఐఆర్ ను అడ్డుకోవడం ద్వారా బంగ్లాదేశీయుల్ని ఓటర్ల జాబితాలో చేర్చాలని చూస్తోందన్నారు. రాహుల్, రేవంత్ రెడ్డి ఎన్ని నిరసనలు చేసుకున్నా.. బీజేపీ మాత్రం వలసదారుల్ని దేశం నుంచి తరిమికొట్టి తీరుతుందన్నారు.
ఎస్ఐఆర్ ను అడ్డుకోవాలని కాంగ్రెస్ గుంపు ప్రయత్నిస్తోందని, ఎందుకంటే వలసదారులంతా దాని ఓటు బ్యాంక్ అన్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం ఎస్ఐఆర్ కు అండగా నిలిచారన్నారు. ఈ దేశ వాసులే ఇక్కడ ఓటు వేయాలన్నారు. 13 కోట్ల ఓట్లు తీసేశారని రాహుల్ గాంధీ చెప్తున్నారని, అందులో ఆరున్నర కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారే అన్నారు. అలాంటి వారిని రెండు చోట్ల ఉంచాల్సిన అవసరం ఉందా అని అమిత్ షా ప్రశ్నించారు. 2.8 కోట్ల మంది చనిపోయిన వారే ఉన్నారన్నారు. వారి ఓట్లు తొలగించాలా వద్దా అని అడిగారు. కాంగ్రెస్ బోగస్ ఓటింగ్ తో ఎన్నికల్ని గెలవాలని చూస్తుందన్నారు. కోటి మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారన్నారు. వీటిని కూడా తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు. 3 కోట్ల ఓటర్లు అస్సలు లేరన్నారు. వీరంతా బంగ్లాదేశీయులే అన్నారు. వీళ్లను కూడా తొలగించాలా వద్దా అని అడిగారు.

తాము ఎస్ఐఆర్ తో గెలిచామని రాహుల్ చెప్తున్నారని , కానీ 2014లో ఎస్ఐఆర్ లేనప్పుడు కూడా మోడీ గెలిచారని గుర్తుచేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బెంగాల్, అస్సోంలో కూడా గెలిచారన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా గెలుస్తామన్నారు. 2024 తర్వాత మహారాష్ట్ర, హర్యానాలో భారీ మెజార్టీలతో గెలిచామని, 30 ఏళ్ల తర్వాత ఢిల్లీలో గెలిచామని, బీహార్ లో, బెంగాల్లో కూడా గెలిచామన్నారు. అస్సోంలో వరుసగా మూడోసారి గెలిచామన్నారు. తాజాగా మాక్ పార్లమెంట్ లో విపక్ష నేతగా ఉండే బదులు ప్రధానమంత్రిగా ఉండాల్సిందని రాహుల్ కు అమిత్ షా సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆయన అసలు పార్లమెంట్ లో ప్రధాని కాలేరన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోతారని, ప్రజా సమస్యలు పట్టించుకోరన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని, దాన్ని గౌరవించరని రాహుల్ పై విమర్శలు గుప్పించారు. ఆయన పార్లమెంట్ ను నడవనీయడం లేదన్నారు. ఎస్ఐఆర్ అయినా, ఈవీఎంలు అయినా, వలసదారుల సమస్య అయినా పార్లమెంట్ లో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, చర్చకు రావాలని రాహుల్ ను పిలిచారు.
ఎన్నికలు గెలిస్తే ఈవీఎంలతో గెలిచారని రాహుల్ అంటారని, ఈవీఎంలు తప్పయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో, కేరళలో, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ లో మీ ప్రభుత్వాలు ఎలా వచ్చారని అమిత్ షా ప్రశ్నించారు. గెలిస్తే ప్రజలు గెలిపించినట్లు, ఓడితే ఈవీఎంలు ఓడించాయని అంటున్నారన్నారు. మోడీ ఆదరణ ముందు మీరు నిలబడలేదన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో 12 లక్షల ఓట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. అలాంటి వారికి మరోసారి దేశం అప్పగించాలా అని ప్రశ్నించారు. మోడీ 12 ఏళ్ల పాలన తర్వాత కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. రాహుల్ ఇలాంటి ఆరోపణలతో ఎన్నికలు గెలవలేరన్నారు. తమిళనాడు, బెంగాల్, గుజరాత్, త్రిపుర, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచి దశాబ్దాలు గడిచి పోయిందన్నారు. ఇవన్నీ ఎస్ఐఆర్ వల్లే జరిగాయా అని రాహుల్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ దేశంలో క్రమంగా కనుమరుగు అవుతుందన్నారు. తెలంగాణలో కూకటి వేళ్లతో పెకలించారని బీజేపీ కార్యకర్తలకు అమిత్ షా పిలుపునిచ్చారు. వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ మోడీతో పోటీపడలేదన్నారు. ఆర్ ఆర్ పన్ను రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి వెళ్తుందన్నారు. రాహుల్ ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. ఆర్టికల్ 370, రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, తీవ్రవాద నిర్మూలన, నక్సలిజం నిర్మూలన వంటి హామీలు మోడీ నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications
