ప్రణయ్ ఆత్మ ఘోషిస్తోంది...నీతో మాట్లాడిస్తాం;విగ్రహం పెట్టొద్దు:ఓ జంట మాయమాటలపై అమృత ఫిర్యాదు
నల్గొండ:ప్రేమ వివాహం చేసుకున్నందుకు ప్రాణాలే కోల్పోయిన ప్రణయ్ కుటుంబం చుట్టూ ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నాయా?..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయిన ప్రణయ్ విగ్రహ స్థాపన ఎలాగైనా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందా?...అంటే అవుననేందుకు మరో రుజువు ఇది. తండ్రి కర్కశత్వానికి భర్త ప్రణయ్ ను పోగొట్టుకొన్న అమృత...అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలో ఏర్పాటుచేయాలని పోరాడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ విగ్రహం స్థాపనకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు ఆందోళనలను చేస్తున్న క్రమంలో ఓ జంట రంగంలోకి దిగింది. పరామర్శ పేరిట అమృతను కలసిన ఈ జంట ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని... ఘోషిస్తూ ఈ ఇంటి చుట్టే తిరుగుతోందని...కావాలంటే నీతో మాట్లాడిస్తామని మాయమాటలు మొదలుపెట్టి చివరకు విగ్రహం పెట్టొద్దని సలహా ఇచ్చింది. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..

అమృతను పరామర్శించేందుకని ప్రణయ్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నఆమె వద్దకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు తమ సంతానంతో సహా వచ్చారు. ఆ క్రమంలో అమృతతో మాట్లాడుతూ ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందని...కావాలంటే నీతో మాట్లాడిస్తామని ఆమెతో చెప్పారు. వచ్చే జన్మలో కూడా ప్రణయ్ నీతోనే జీవించాలని అనుకుంటున్నాడమ్మా...ఆ విషయమే మాకు చెబుతున్నాడు అంటూ మాయమాటలతో ఆమెను నమ్మించే ప్రయత్నం చేశారు.
ప్రణయ్ ఆత్మ నీ కోసం ఘోషిస్తూ మీ ఇంటిచుట్టే తిరుగుతోందన్నారు. మారుతీరావు, ప్రణయ్‌లు గత జన్మలో శత్రువులు. ఈ జన్మలో పగ తీర్చుకునేందుకు ప్రణయ్‌ని మారుతీరావు హత్య చేయించాడే తప్ప అతడిపై మారుతీరావుకు నిజమైన పగలేదు. ప్రణయ్ విగ్రహం పెట్టొద్దు. విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుంది అంటూ అమృతకు వారు నచ్చచెప్పాలని చూశారు.
అయితే ఈ దంపతుల తీరు,ప్రవర్తనపై అనుమానం కలిగిన అమృత వెంటనే డీఎస్పీ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసింది. దీంతో వన్‌టౌన్ సీఐ నాగరాజు ప్రణయ్ ఇంటివద్దకు చేరుకొని ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అసలు ఆ దంపతులు ప్రణయ్ ఇంటికి ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎవరైనా పంపితే వచ్చారా?...అనే కోణాల్లో పోలీసులు వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్రమప్తమైన పోలీసులు ప్రణయ్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Recommended Video













Click it and Unblock the Notifications