విద్యార్థులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్..
తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ (ITI) ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATC)గా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడేషన్ పనులపై ముఖ్యమంత్రి.. కార్మిక శాఖ ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమీక్షించారు.
ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ఏటీసీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒకటి ఉండేలా చూడాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని చేయాలని, ఐటీఐలు లేని కేంద్రాల్లో కొత్తగా ఏటీసీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏటీసీల్లో అవసరమైన సిబ్బంది ఇతర వివరాలను అధికారులు వివరించగా, సిబ్బంది నియామకాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులను వెంటనే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
అలాగే గిగ్, ఫ్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్ విషయంలో పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వెబ్‌సైట్ లాంఛ్
తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి వెబ్‌సైట్ https://yipschool.in ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేశారు.

2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్‌తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్‌గా ఉండేలా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అడ్మిషన్లలో పోలీసు అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్రతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్ నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబర్ 21న ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు.












Click it and Unblock the Notifications