తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: పవన్ కళ్యాణ్ ఆదేశం
అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసింది. దీంతో అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటయ్యాయి. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు 475 మందితో కూడిన ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
ఈ రెండు జిల్లాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మొత్తం 100 ప్రత్యేక బృందాలను కేటాయించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 55 బృందాలు, పశ్చిమ గోదావరి జిల్లాకు 45 బృందాలను పంపనున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందిని ఈ పనుల కోసం కేటాయించారు. క్షేత్రస్థాయిలో నలుగురు సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను ముందుకు తీసుకువెళ్లనున్నారు.

తుపాను కారణంగా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్, క్లోరినేషన్ చేపట్టడం వంటి పనులకు ఈ ప్రత్యేక బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, జనావాసాల మధ్య నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టనున్నాయి.
భారీ వర్షాలు, వరద నీటి కారణంగా గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఏర్పడి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు.
తుపాను ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. అందుకోసం కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి 48 మంది సాంకేతిక సిబ్బందిని కేటాయించారు. ఈ బృందాల్లో డీఈ, ఏఈలు, కెమిస్టులు, మైక్రోబయాలజిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు.
గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తాగునీటి వనరులు, సరఫరా అవుతున్న నీటి నాణ్యతను అక్కడికక్కడే ఈ బృందాలు పరీక్షిస్తాయి. నీటి పరీక్షల్లో నాణ్యతకు సంబంధించిన ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించనున్నారు. నీటి సరఫరాలో గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ముఖ్యంగా తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న రెండు జిల్లాల్లో స్థానిక సిబ్బందికి అదనంగా ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను పంపడం ద్వారా సహాయక, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామాల్లో నీటి నిల్వలు తొలగించడం, మురుగు శుభ్రం చేయడం, తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించడం ద్వారా ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications
