తెలంగాణలో TRS వెనక ఎవరు?
తెలంగాణ రైతు సమాఖ్య, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి... ఇలా టీఆర్ఎస్ అనే పేరు వచ్చేలా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ హోరాహోరీగా తలపడటం ఖాయమైంది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరగడం స్పష్టమైందని విశ్లేషకులు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తామని ప్రతి పార్టీ చెబుతోంది. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో మరో రాజకీయ పార్టీ కొత్తది ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. BRS పాతపేరు TRSను తీసుకోవాలని రాజకీయ నేతలు పలువురు ప్రయత్నిస్తున్నారు. పార్టీ పేరు TRS వచ్చేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ రైతు సమాఖ్య, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి... ఇలా టీఆర్ఎస్ అనే పేరు వచ్చేలా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ పరంగా TRS అనేది విజయవంతమైన పేరు. ఆ పేరును క్యాష్ చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ఈ పేరుతో ఎవరైనా పార్టీని ఏర్పాటు చేస్తే భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లో ఇప్పటికే టీఆర్ఎస్ అనే పదం బాగా నానడంతో బీఆర్ఎస్ కువచ్చే ఓట్లు టీఆర్ఎస్ కు పడే అవకాశం ఉందంటున్నారు. అయితే TRS BRSగా మారడంతోపాటు రిజిస్టరవడంతో అధికారులు కొత్తగా TRS పేరును ఏ రాజకీయ పార్టీకి ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే TRS పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల వెనక ఎవరున్నారనేది సందేహాస్పదంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి భారతీయ జనతాపార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎటువంటి పరిస్థితుల్లోను తెలంగాణలో అధికారంలోకి రావాలని యోచిస్తోంది. అందుకు ముందుగా కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయగలిగితే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు దొరికినట్లేనని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా మూడోసారి ఎన్నికలకు వెళ్లబోతోంది. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications