ట్రాన్స్‌జెండర్లకు కాంగ్రెస్ సర్కార్ మరో తీపికబురు..
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ట్రాన్స్‌జెండర్ సమాజానికి అండగా నిలిచింది. వారి కోసం మరిన్ని ఉపాధి అవకాశాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ రంగంలో ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే గత ఎనిమిది నెలలుగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు విజయవంతంగా పనిచేస్తున్నారు. వారి క్రమశిక్షణ, పనితనం, కట్టుదిట్టమైన విధానాలు ప్రభుత్వానికి నమ్మకాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వారిని ఇతర విభాగాల్లోనూ అవకాశం ఇవ్వాలని సంకల్పించారు.
ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలు..
జీహెచ్‌ఎంసీ (GHMC), ఆర్టీసీ (RTC), హెచ్‌ఎండీఏ (HMDA)లలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ ఉద్యోగాలలో నియమించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీలో 25 ఉద్యోగాలు, ఆర్టీసీలో 20 ఉద్యోగాలు ప్రస్తుతానికి ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత ఈ పథకం తక్షణమే అమల్లోకి రానుందని అంటున్నారు.

ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం, దశలవారీగా ప్రైవేట్ రంగం - ముఖ్యంగా ఐటీ కంపెనీలలో సెక్యూరిటీ విభాగంలో కూడా ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో, వారి విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా ప్రత్యేక శిక్షణ అందించి, ప్రొఫెషనల్‌గా తయారు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల ట్రాన్స్‌జెండర్లు కేవలం ఉపాధి పొందడమే కాకుండా, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో గౌరవం పొందే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి భిక్షాటన, వినోదరంగంలో మాత్రమే అవకాశాలు అనే ముద్రను చెరిపేసే ప్రయత్నమని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంపై LGBTQ కమ్యూనిటీకి చెందిన పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చాలా మంది ట్రాన్స్‌జెండర్లకు ఇది ఒక ఆశాకిరణంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ జాబితాలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కూడా చేరడంతో, ట్రాన్స్‌జెండర్ల సాధికారత దిశగా తెలంగాణ మరో అడుగు ముందుకేసిందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మొత్తానికి ఈ నిర్ణయం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇన్‌క్లూజివ్ పాలసీకి ఆదర్శంగా నిలిచే అవకాశముందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications