అలాంటి వారికి జైలే:హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్: నగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే ఫిర్యాదులు అందిన వెంటనే లేదా ఆక్రమణలని గుర్తించిన తక్షణమే హైడ్రా కూల్చివేతలు చేపడుతూ హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు హైడ్రా పేరుతో అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.
సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు.

ప్రభుత్వ విభాగాలైన రెవిన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు.
అమీన్‌పూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ బండ్ల విప్లవ సిన్హాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు పడుతున్నారని, హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
జవహర్ నగర్‌లో ఆక్రమణలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అక్కడి చెరువులను పరిశీలించారు. అంబేద్కర్ నగర్‌లోని ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా కబ్జాలకు గురైనట్లు గుర్తించారు. మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫాం హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారని గుర్తించిన హైడ్రా అధికారులు.. అనుమతులు ఎవరిచ్చారనే విషయంపై ఆరా తీశారు. ఫాంహౌస్‌లకు అనుమతులు ఇవ్వడం, చెరువులను కబ్జా చేయడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాలు ఎవరివైనా కూల్చివేస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications