జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ట్రయల్‌గా ఉపయోగించుకుంటున్న టీడీపీ-బీజేపీ-జనసేన?
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికను తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీలు ట్రయల్ గా ఉపయోగించుకుంటున్నాయి. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, భారత రాష్ట్ర సమితి తరఫున సునీత బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారవలేదు. ఢిల్లీలో ఎంపిక జరగనుంది. బీజేపీ అభ్యర్థి కూడా ఖరారైన తర్వాత ఒక్కసారిగా రాజకీయం వేడెక్కే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడిగా తొలగించకుండా అలాగే ఉంచితే మొన్నటి ఎన్నికల్లోనే ఆ పార్టీ అధికారం చేపట్టడానికి ఎక్కువ అవకాశం ఉండేది. కానీ బీజేపీ వారే తమ పార్టీని చంపేసుకున్నారు. దీనివెనక అనేక రాజకీయ కారణాలున్నాయి.
తెలంగాణలో కూడా కూటమిగా వెళ్దామని..
ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టీడీపీ-జనసేన ఎంపీలు కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చారు. వీరి మద్దతే కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఇలాగే కూటమిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగిద్దామని ఈ మూడు పార్టీలు భావిస్తున్నాయి. అందుకు తగిన కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నిలబడితే తాము పోటీచేయకుండా ఆ పార్టీకి మద్దతివ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు జనసేన మద్దతు కూడా ఉంటుంది. ఇక్కడ విజయం సాధిస్తామా? లేదంటే ఎన్నో స్థానంలో నిలుస్తాం? ఎంతవరకు పార్టీల ఓట్లు బదలాయింపబడ్డాయి? అనే విషయాలను బేరీజు వేసుకొని భవిష్యత్తులో కూటమిగా వెళ్లే అవకాశం ఉంది.

ఎవరి నష్టం కలుగుతుందో అంచనా వేసి..
టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని మార్చే యోచనలో ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా జనసేనను తెలంగాణలో బలోపేతం చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూటమిగా ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబుకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీజేపీతో మైత్రిని కొనసాగించాలి.. అలాగే తన శిష్యుడు రేవంత్ రెడ్డికి అన్యాయం చేయలేరు. పార్టీ అభ్యర్థులను నిలబెడితే బీఆర్ఎస్ కు నష్టం కలుగుతుందా? రేవంత్ కు నష్టం కలుగుతుందా? అనే అంచనాలు రూపొందించుకొని అందుకు తగ్గ ప్రణాళికను చంద్రబాబు భవిష్యత్తులో అమలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications