కౌశిక్ రెడ్డిని ఏకిపారేసిన అరెకపూడి గాంధీ: కేసీఆర్‌పై ప్రశంసలతో షాక్
ఓ వైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిస్తూనే.. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పీఏసీ ఛైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై శుక్రవారం అరెకపూడి మరోసారి స్పందించారు. తనకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటే ఎంతో గౌరవమన్న అరెకపూడి గాంధీ.. పార్టీలో కోవర్టుగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమికి కారకులయ్యారంటూ కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి ఏమైనా పదవి ఇచ్చిందా? తనతో మాట్లాడటానికి బీఆర్ఎస్‌లో ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. దేశ మహిళలను అవమానించేలా చీర, గాజుల గురించి మాట్లాడారు. నీ ఇంటికి వస్తా. కండువా వేసి తీసుకెళ్తా అంటే అర్థమేంటి? ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తావా? అంటూ కౌశిక్ రెడ్డిపై అరెకపూడి గాంధీ ఫైరయ్యారు.

కౌశిక్ రెడ్డి రౌడీయిజం చేయడం దేనికి? తీరు మార్చుకోవాలి. అతను రెచ్చగొట్టినందుకే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు అరెకపూడి గాంధీ. తమపైనే బీఆర్ఎస్ నేతలు దాడి చేశారన్నారు. తాము ఒక్కరిపై కూడా దాడి చేయలేదన్నారు. నీ ఇంటికి వస్తే ఏం చేశావు.. రాళ్లు రువ్వావు. పూల కుండీలు విసిరావు అంటూ కౌశిక్ రెడ్డిపై అరెకపూడి గాంధీ ధ్వజమెత్తారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు తన గురించి పూర్తిగా తెలుసని.. అందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అరికపూడి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే ఎప్పటికీ తనకు గౌరవమేనని అన్నారు. కేసీఆర్ తమను ఆదరించి ఆశీర్వదించారని అన్నారు. కానీ, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు ఉంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. నోటికి అదుపులేని మనిషిని ఊరుమీదకు వదిలేశారని, అలాంటి వారి వల్లే అధికారాన్ని కోల్పోయామన్నారు.
కౌశిక్ రెడ్డి వల్ల కేసీఆర్ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకు చెడ్డపేరు వస్తుందని అరెకపూడి గాంధీ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని, ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారితో పార్టీలో ప్రమాదం అని కేసీఆర్ గుర్తించాలన్నారు. కౌశిక్ రెడ్డి లాంటివారి వల్ల మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే, కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉంటూనే మరోవైపు కేసీఆర్‌పై అరెకపూడి గాంధీ ప్రశంసలు చేయడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications