నిర్ణయం తీసుకుంటారా, లేదా: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ఎంత సమయం కావాలో సభాపతిని అడిగి చెప్పాలని తెలంగాణ ఏజీ రామకృష్ణా రెడ్డిని హైకోర్టు గురువారం ప్రశ్నించింది.
ఫిరాయింపు నేతలపై వచ్చిన ఫిర్యాదులు చట్టసభల ముందు పెండింగులో ఉండగా హైకోర్టు న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటున్నారని, అయితే వాటిని పరిష్కరించేందుకు ఇంకెంతకాలం పడుతుందో చెప్పమంటే చెప్పడం లేదని, ఓ టర్మ్ అంటే ఐదేళ్లు పడుతుందా, ఈ విషయం చెప్పాలని, ఆ తర్వాత హైకోర్టుకు ఆ పరిధి ఉంటుందా లేదా అనే విషయం తేల్చుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
పార్టీ ఫిరాయింపులపై అసలు చర్యలు తీసుకుంటారా లేదా చెప్పాలంది. సభాపతిని అఢిగి ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. అనంతరం విచారణను 22వ తేదీకి వాయిదా వేసింది.

పార్టీ ఫిరాయించిన శాసన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసిన వ్యాజ్యాలపై మీ నిర్ణయం తెలిపాకే ఈ వ్యాజ్యాల్లో విచారణ కొనసాగించాలో లేదో? నిర్ణయిస్తామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
తెరాసలో చేరిన శాసన సభ్యులు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, చల్లా ధర్మా రెడ్డిలపై చర్యలు తీసుకోనేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్ రెడ్డిలు తెరాసలో చేరారని వారిపై చర్యలకు స్పీకర్ ఆదేశించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విప్ ఎస్ఎ సంపత్‌కుమార్, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే మదన్‌లాల్ పార్టీ ఫిరాయించారని వైకాపా నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పీకర్ వద్ద దాఖలైన వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిరాయింపు వ్యాజ్యాలపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పైవిధంగా స్పందించింది.












Click it and Unblock the Notifications