వేణుస్వామి సంచలన జోస్యం.. కాక్రోచ్ దెబ్బకు కమలం ఖేల్ ఖతం?
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో దేశరాజకీయాల్లో ఊహించని తుఫాను చెలరేగింది. ఒక చిన్న వ్యంగ్యాస్త్రంగా ప్రారంభమైన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఇప్పుడు అధికార పక్షాన్ని గజగజ లాడిస్తోంది. సుప్రీంకోర్టు విచారణ సమయంలో 'ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు బొద్దింకల లాంటివారు' అంటూ వచ్చిన వ్యాఖ్యలను ఛాలెంజ్‌గా తీసుకున్న జెన్-జీ యువత, ఆ పేరుతోనే వ్యవస్థపై డిజిటల్ పోరాటానికి దిగింది. సోషల్ మీడియాలో రికార్డు స్థాయి ఫాలోయింగ్ సాధించడమే కాకుండా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబడుతూ రచ్చకెక్కుతోంది. ఈ ఊహించని ఉద్యమ తీవ్రతపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మోదీ జాతకంతో 'షష్ఠాష్టకాలు': బీజేపీకి 90 శాతం నష్టం!
సీజేపీ జాతకాన్ని విశ్లేషించిన వేణుస్వామి, కమలం పార్టీకి రాబోయే రోజుల్లో గండం పొంచి ఉందని సంచలన జోస్యం చెప్పారు. సీజేపీ జాతక చక్రం, లగ్న చక్రం.. ప్రధాని నరేంద్ర మోదీ జాతకంతో పాటు బీజేపీ అధికారిక కాంబినేషన్‌కు 'షష్ఠాష్టకం'గా మారాయని తెలిపారు. దీనివల్ల పొలిటికల్ మార్కెట్‌లో సీజేపీ మూలంగా దాదాపు 90 శాతం నష్టం కేవలం బీజేపీకే జరుగుతుందని జోస్యం చెప్పారు. ఈ కొత్త ఉద్యమం వల్ల రాబోయే రోజుల్లో దేశంలో ఒక బలమైన ప్రభుత్వ రాజకీయ భవితవ్యాన్ని మార్చేసే లేదా గద్దెనెక్కించే స్థాయికి 60 శాతానికి పైగా ప్రభావం చూపే శక్తి సీజేపీకి వస్తుందని స్పష్టం చేశారు.
అక్టోబర్ 31 తర్వాత అసలు రచ్చ.. అణచివేస్తే రివర్స్!
సీజేపీ పార్టీ కుండలిని పరిశీలిస్తే సింహలగ్నంలో ఉండి రవి-బుధుల కలయికతో 'బుధాదిత్య యోగం', అలాగే సంపూర్ణ 'కాలసర్పసహిత రాజయోగం' కలిగి ఉందని వేణుస్వామి విశ్లేషించారు. అందుకే ఈ స్థాయి క్రేజ్ లభించిందన్నారు. అక్టోబర్ 31 వరకు వీరికి ఒక రకమైన పబ్లిసిటీ ఉంటే, ఆ తర్వాత అసలైన వేరే లెవెల్ రచ్చ మొదలవుతుందని హెచ్చరించారు. పదో ఇంట రాహువు, పన్నెండో ఇంట కుజుడు ఉన్నందున ఈ యువతలో తీవ్రమైన ఆవేశం, తొందరపాటు ఎక్కువ ఉంటాయని చెప్పారు. వీరిని గనుక బలప్రయోగంతో లేదా యుద్ధ వాతావరణంలో అణచివేయాలని ప్రభుత్వం చూస్తే దెబ్బ రివర్స్ అవుతుందని, ఇది బీజేపీకి కోలుకోలేని దెబ్బగా మారుతుందని హెచ్చరించారు.
కేంద్ర మంత్రి రాజీనామా ఖాయం.. మూల్యం చెల్లించుకోక తప్పదా?
మరో వైపు సీజేపీ చేస్తున్న ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కూడా వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ లీకేజీ కారణమో లేక వేరే ఏదైనా వ్యవహారమో గానీ, నూటికి నూరు శాతం ఆయన పదవికి రాజీనామా చేయడం ఖాయమని జ్యోతిష్యపరంగా చెప్పారు. అయితే, ఈ తీవ్రమైన ఉద్యమ క్రమంలో సీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు జైలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని, శాస్త్ర విరుద్ధంగా, హిందూ ధర్మానికి భిన్నంగా వీళ్లు అడుగులు వేసే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఏది ఏమైనా, ఓ సామాన్య ట్రోల్ పేజ్ గా మొదలైన ఈ 'బొద్దింకల పోరాటం' కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి నిద్రలేకుండా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications